భారత్‌లో గ్యాంబ్లింగ్‌ తరహాలోనే ఇక క్రిప్టోకరెన్సీపై కూడా.. : ఆర్థిక కార్యదర్శి

India Crypto To Be Taxed Like Gambling Win Says Finance Secretary - Sakshi

క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్‌ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్‌కు పెద్ద షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. 

జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్‌జాక్షన్స్‌పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్‌జాక్షన్స్‌ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. 

‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్‌జాక్షన్స్‌.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్‌ స్పష్టం చేశారు. 

క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్‌, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్‌ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్‌ నుంచి క్లియరెన్స్‌ ద్వారా పార్లమెంట్‌లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top