
క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగి రికార్డు స్థాయిలో రూ.21.16 లక్షల కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరుగుదలను నమోదు చేసింది. రుణ ఆధారిత వినియోగం అధికం అవుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పట్టణ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు విచక్షణా వ్యయం కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ట్రావెల్, డైనింగ్ వంటి రంగాల్లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.
ఆన్‌లైన్ చెల్లింపులపై ఆసక్తి చూపడం క్రెడిట్ కార్డు వినియోగానికి ఆజ్యం పోసింది. మూడింట రెండొంతుల లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.
వ్యయాల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్
2025 మార్చి నాటికి చలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 10.98 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 10.18 కోట్లుగా ఉండేది. కొత్త కార్డుల జారీ బ్యాంకుల వారీగా భిన్నంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ వంటి ఇతర సంస్థలు రెగ్యులేటరీ సవాళ్లు, భాగస్వామ్యాల్లో మార్పుల కారణంగా కార్డుల జారీలో క్షీణతను ఎదుర్కొన్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించడానికి బ్యాంకులు క్రెడిట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులను క్రాస్-సెల్లింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి.