బయోఎకానమీ బూమ్‌...! | India Bioeconomy Surges to USD 195 Billion in 2025 | Sakshi
Sakshi News home page

బయోఎకానమీ బూమ్‌...!

Mar 29 2026 4:36 AM | Updated on Mar 29 2026 6:02 AM

India Bioeconomy Surges to USD 195 Billion in 2025

భారత్‌లో 2025లో 195 బిలియన్‌ డాలర్లకు చేరిక 

ఇథనాల్, జీఎల్‌పీ–1తో డిమాండ్‌ బూస్ట్‌ 

వృద్ధికి బీఐఆర్‌ఏసీ ప్రోత్సాహం

న్యూఢిల్లీ: భారతీయ బయోఎకానమీ విలువ గణనీయంగా పెరుగుతోంది. బయోటెక్నాలజీ ఆధారిత రంగాల్లో వేగవంతమైన అభివృద్ధితో దేశీయ ‘బయోఎకానమీ విలువ 2025లో 195 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2024) విలువ 166 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. బయోటెక్‌ రంగాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌’ (బీఐఆర్‌ఏసీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

విస్తరిస్తున్న బయోఎకానమీ పరిధి: ఒకప్పుడు ‘బయోఎకానమీ’ అనేది బయోఫార్మా, బయోఇండ్రస్టియల్‌ వంటి రంగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం దీని పరిధి పెరిగింది. బయోఫ్యూయల్స్, ఎంజైమ్‌ సొల్యూషన్స్, డిజిటల్‌ బయాలజీ ప్లాట్‌ఫారŠమ్స్, కాంట్రాక్ట్‌ రీసెర్చ్, బయోలాజిక్స్‌ తయారీ, వ్యవసాయ బయో ఇన్‌పుట్స్‌ వంటి విభాగాలకు విస్తరించింది. దీంతో బయోఎకానమీ విస్తృత పారిశ్రామిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో 
కీలకంగా నిలుస్తోంది. 

వృద్ధికి ప్రధాన కారణాలు: బయోఎకానమీ వృద్ధికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి. 
 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం అమలు వల్ల ఇంధన దిగుమతులు తగ్గడం 
జీఎల్‌పీ–1 ఔషధాల వినియోగం పెరగడం 
పరిశ్రమల్లో ఎంజైమ్స్, సూక్ష్మజీవాల ఆధారిత బయోసొల్యూషన్స్‌ వినియోగం పెరగడం...  

మూడు లక్షలకు పైగా భారతీయ నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ ఈ అంశాలన్నీ బయోఎకానమీ విస్తరించేందుకు ప్రధాన కారకాలుగా నిలిచాయి. ఈ పరిణామాల వల్ల 2025లో బయోఎకానమీకి అదనంగా 29.6 బిలియన్‌ డాలర్ల విలువ చేకూరింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా నిలిచింది.  

కీలకంగా బీఐఆర్‌ఏసీ పాత్ర  
బీఐఆర్‌ఏసీ గ్రాంట్‌ ఫండింగ్, ఈక్విటీ సపోర్ట్, మెంటరింగ్, భాగస్వామ్యాల ద్వారా బయోఫార్మా, మెడ్‌టెక్, అగ్రి బయోటెక్, హెల్త్‌టెక్, ఇండ్రస్టియల్‌ బయోటెక్, క్లీన్‌టెక్‌ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడులను ప్రోత్సహించింది. 900కిపైగా ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది. దాదాపు 35,000కు పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది.

2030 నాటికి బయోఎకానమీని 300 బిలియన్‌ డాలర్లకు, 2047 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘‘గత 14 ఏళ్లలో బీఐఆర్‌ఏసీ భారత బయోటెక్నాలజీ రంగాన్ని ఆవిష్కరణల ఆధారిత శక్తివంతమైన వ్యవస్థగా మార్చింది. స్టార్టప్స్, సంస్థలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వందలాది ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది,’’ అని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేష్‌ ఎస్‌ గోఖలే తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement