అంచనాలను మించిన ఆదాయపన్ను వసూళ్లు | Sakshi
Sakshi News home page

అంచనాలను మించిన ఆదాయపన్ను వసూళ్లు

Published Sat, Apr 10 2021 5:23 AM

Income tax and corporate tax collections at Rs 9.45 lakh crore  - Sakshi

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రూపేణా రూ.9.45 లక్షల కోట్ల ఆదాయం 2020–21 ఆర్థిక సంవత్సరంలో సమకూరింది. సవరించిన అంచనాల కంటే ఇది 5 శాతం అధికం కాగా.. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లో వచ్చిన ఆదాయం కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. ఈ మేరకు వివరాలను ఆదాయపన్ను శాఖ శుక్రవారం విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.13.19 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తుందని తొలుత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ తర్వాత కరోనా రాకతో ఆర్థిక వ్యవస్థ చతికిలపడడం తెలిసిందే. దీంతో కేంద్ర సర్కారు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష పన్నుల ఆదాయం అంచనాలను రూ.9.05 లక్షల కోట్లకు సవరించింది.

ఆదాయపన్ను రిఫండ్‌లను (అధికంగా వసూలు చేసిన పన్నును తిరిగి ఇచ్చేయడం) పెద్ద మొత్తంలో చేసినప్పటికీ.. సవరించిన పన్నుల ఆదాయ అంచనాలను తమ శాఖ అధిగమించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీ పేర్కొన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ సంస్థల ఆదాయపన్ను చెల్లింపులను ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటారు. 2019–20 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.10.49 లక్షల కోట్లు రావడం గమనార్హం. తాజాగా ముగిసిన 2020–21లో ఇది రూ.9.45 లక్షల కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.11.08 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేయడం గమనార్హం.

రూ.2.61లక్షల కోట్ల రిఫండ్‌లు  
ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో కార్పొరేట్‌ పన్ను రూపేణా రూ.4.57 లక్షల కోట్లు సమకూరగా.. వ్యక్తిగత ఆదాయపన్ను ద్వారా రూ.4.71 లక్షల కోట్లు వచ్చింది. రూ.16,927 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో వసూలైంది. రూ.2.61 లక్షల కోట్ల మేర పన్ను రిఫండ్‌లను కూడా కలిపి చూస్తే స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 2020–21 సంవత్సరానికి రూ.12.06లక్షల కోట్లుగా ఉంది. పన్ను రిఫండ్‌లు గత ఆర్థిక సంవత్సరానికి 42 శాతం పెరిగాయి. ‘‘కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లను తీసుకొచ్చినప్పటికీ.. 2020–21 సంవత్సరానికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో పెరుగుదల నమోదైంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. పన్ను నిబంధనల అమలు భారాన్ని తగ్గించేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు పీసీ మోదీ పేర్కొన్నారు. ఇది పన్నుల ఆదాయంలో ప్రతిఫలించినట్టు చెప్పారు.
 

Advertisement
Advertisement