క్రెడిబులిటీ ఉన్న డెవలపర్లతోనే ఒప్పందం చేసుకోండి

Important things While Giving Property To Developers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నెలకొంటున్న రియల్టీ హైప్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కొందరు భూ యజమానులు అత్యాశకు పోతున్నారు. సాధారణంగా డెవలపర్‌కు, భూమి యజమానికి మధ్య 40:50 లేదా 50:50 నిష్పత్తితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకుంటారు. ఎక్కువ అడ్వాన్స్, నిర్మాణ స్థలం ఇచ్చే డెవలపర్లకే డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌కు అప్పగిస్తున్నారు. మరి, నిజంగానే సదరు డెవలపర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలడా? అనే అంశాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. కేవలం డెవలపర్‌ ఇచ్చే అడ్వాన్స్‌ మీదే దృష్టిపెడుతున్నాడు. ఎవరైనా డెవలపర్‌ స్థలం కోసం వస్తే చాలు 30 అంతస్తులు, 40 అంతస్తులు కడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫలానా డెవలపర్‌ అంత అడ్వాన్స్‌ ఇస్తానన్నాడు? మరో డెవలపర్‌ ఇంత పర్సంటేజ్‌ ఇస్తానన్నాడంటూ వచ్చిన డెవలపర్‌తో బేరమాడుతున్నారు. దీంతో అసలైన డెవలపర్‌కు స్థలాన్ని అప్పగించే బదులు ఫ్యాన్సీ నంబర్లు చెప్పే మోసపూరిత డెవలపర్లకు స్థలాన్ని అగ్రిమెంట్‌ చేస్తున్నారు. ఈ బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. అగ్రిమెంట్‌ చేసుకొని.. ఆ స్థలాన్ని యూడీఎస్‌ కింద కొనుగోలుదారులకు ముందే విక్రయించేస్తున్నారు. వాళ్లు ఇచ్చే సొమ్మును స్థల యజమానికి ఇచ్చేస్తున్నారు. తీరా నిర్మాణ పనులు వద్దకొచ్చేసరికి.. దిక్కులు చూసే పరిస్థితి నెలకొంటుంది. నిర్మాణం ఆరంభమై ఒక స్థాయికి వస్తే తప్ప మిగిలిన ఫ్లాట్లను అమ్మలేని పరిస్థితి. అమ్మడానికి ప్రయత్నించినా.. ఈ లోపు మరో డెవలపర్‌  యూడీఎస్‌లో ఫ్లాట్లను అమ్మడం ఆరంభిస్తాడు. ఫలితంగా అమ్మకాల్లేక ప్రాజెక్ట్‌ నిలిచిపోతుంది. 

డెవలప్‌మెంట్‌కు ఇచ్చే ముందు.. 
- స్థల యజమానులు అధిక అంతస్తులు, ఎక్కువ అడ్వాన్స్‌లు తీసుకొని మురిసిపోవటం మానేసి.. అసలు డెవలపర్‌ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయగలడా? లేదా అనే అంశాన్ని ఆలోచించాలి.  
- అమ్మకాల మీదే ఆధారపడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని భావించే డెవలపర్లకు స్థలాన్ని ఇవ్వకపోవటమే మంచిది. 
- ఎవరైనా స్థలం ఇవ్వమని చర్చలకు వచ్చినప్పుడు ఆయా డెవలపర్‌ క్రెడిబులిటీని పరిశీలించడంతో పాటు నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రణాళికల గురించి చర్చించాలి. 
- ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక డెవలపర్‌ తోక జాడించే అవకాశం ఉందా? అనవసరంగా ఇబ్బందుల్ని సృష్టిస్తాడా? అనే అంశాన్ని బేరీజు వేయాలి. 
 - స్థలాన్ని అప్పగించాక సకాలంలో ఫ్లాట్లను అందించక కొనుగోలుదారులకు తలనొప్పు లు తెస్తాడా? వంటి అంశాన్ని విశ్లేషించాలి. 
- ఫ్లాట్లను విక్రయించడానికి ఏజెంట్ల మీద ఎక్కువ ఆధారపడతాడా? లేక సొంత సిబ్బంది ఎంతమేర ఉన్నారనేది తెలుసుకోవాలి. 
 - కొనుగోలుదారుల నుంచి తీసుకున్న సొమ్ము తీసుకొని వేరే ప్రాజెక్ట్‌లోకి మళ్లిస్తున్నాడా? లేక ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసమే ఖర్చు చేస్తున్నాడా? వంటి అంశాన్ని ఆరా తీయాలి. 
- ఆర్ధిక నష్టాల్లో ఉన్న డెవలపర్లకు జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేయకపోవటమే మంచిది.  

చదవండి:JLL: ఇన్‌స్టిట్యూషన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హైదరాబాద్‌ టాప్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top