Sakshi News home page

Hurun Report: రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్‌!

Published Wed, Apr 10 2024 9:11 AM

Hurun Shows 171 Unicorns Added And India Be In Third Position - Sakshi

అత్యధిక యూనికార్న్‌లు కలిగిన కంపెనీల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ మూడో స్థానంలో నిలిచినట్లు హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2024 నివేదిక ద్వారా తెలిసింది. ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలను నివేదికలో వెల్లడించారు.

నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 171 అంకురాలు యూనికార్న్‌ (కంపెనీ విలువ రూ.8300 కోట్లు) హోదా సాధించాయి. అంటే ఏడాదిలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్‌ పుట్టుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,453 యూనికార్న్‌లున్నాయి. 2022తో పోలిస్తే 7% అధికంగా కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరాయి. కొత్తగా అమెరికాలో 70, చైనాలో 56 సంస్థలు యూనికార్న్‌ స్థాయికి చేరాయి. దాంతోపాటు యూఎస్‌లో 21, చైనాలో 11 కంపెనీలు ఈ హోదా నుంచి తప్పుకున్నాయి. ఇతర దేశాల నుంచి 45 కొత్త అంకురాలు యూనికార్న్‌లుగా మారాయి. భారత్‌లో మాత్రం గతంలో మొత్తం 68 యూనికార్న్‌లుండేవి. వాటి సంఖ్య గతేడాది 1 తగ్గి 67కు చేరింది. అయితే గతేడాదితోపోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మూడో స్థానంలోనే కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మస్క్‌

అమెరికా ప్రపంచంలోనే మొత్తం 703 యూనికార్న్‌లతో తొలి స్థానంలో ఉంది. చైనా 340 యూనికార్న్‌లతో రెండో స్థానంలో నిలిచింది. 53 యూనికార్న్‌లతో యూకే నాలుగో స్థానంలో ఉంది. ఏడాది క్రితం 22 బి.డాలర్ల (సుమారు రూ.1.82 లక్షల కోట్ల) విలువ కలిగిన బైజూస్‌, ఈసారి జాబితాలోనే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో మరే కంపెనీకి ఇప్పటివరకు రాలేదు. భారత్‌లో స్టార్టప్‌ రంగానికి ప్రోత్సాహం తగ్గిందని, వెంచర్‌క్యాపిటల్ట్‌లు భారీ పెట్టుబడులు పెట్టడం లేదని హురున్‌ ఇండియా వ్యవస్థాపకులు అనాస్‌ రెహ్మన్‌ జునైద్‌ తెలిపారు. కంపెనీల విలువ ఆధారంగా హురున్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన టాప్‌ సంస్థలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • బైట్‌ డ్యాన్స్‌ 
  • స్పేస్ ఎక్స్
  • ఓపెన్‌ఏఐ
  • యాంట్‌ గ్రూప్‌
  • షీన్
  • స్ట్రైప్‌
  • డేటాబ్రిక్స్‌
  • కాన్వా
  • బినాన్స్‌
  • విబ్యాంక్‌

Advertisement

What’s your opinion

Advertisement