భారత్‌ కుబేరుల్లో అంబానీ టాప్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌ కుబేరుల్లో అంబానీ టాప్‌

Published Tue, Oct 10 2023 7:53 PM

Hurun India Rich List 2023:mukesh Ambani Overtakes Gautam Adani - Sakshi

ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా 360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా సంపన్నుల జాబితా 2023లో అగ్రస్థానంలో నిల్చారు. రూ. 8.08 లక్షల కోట్ల సంపదతో ఆయన టాప్‌ ర్యాంకు దక్కించుకున్నారు. గత ఏడాది వ్యవధిలో అంబానీ సంపద స్వల్పంగా రెండు శాతం పెరిగింది. అటు మరో దిగ్గజం గౌతమ్‌ అదానీ రూ. 4.74 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానం దక్కించుకున్నారు.

ఆయన సంపద 57 శాతం కరిగిపోయింది. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాలు, షేర్లలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణల దెబ్బతో అదానీ సంస్థల షేర్లు కుదేలవడం ఇందుకు కారణమని హురున్‌ ఎండీ, చీఫ్‌ రీసెర్చర్‌ అనాస్‌ రెహా్మన్‌ జునైద్‌ తెలిపారు. ఆగస్టు 30 తేదీ ప్రాతిపదికగా హురున్‌ ఈ జాబితాను రూపొందించింది. ఈసారి లిస్టులో 138 నగరాలకు చెందిన 1,319 మంది కుబేరులకు చోటు దక్కింది.

రూ. 2.78 లక్షల కోట్ల సంపదతో (36 శాతం వృద్ధి) సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత సైరస్‌ పూనావాలా మూడో స్థానంలో, రూ. 2.28 లక్షల కోట్లతో (23 శాతం వృద్ధి) హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ శివ్‌ నాడార్‌ ఆ తర్వాత ర్యాంకులో ఉన్నారు. గత ఏడాది వ్యవధిలో భారత్‌లో ప్రతి మూడు వారాలకు కొత్తగా ఇద్దరు బిలియనీర్లుగా ఎదిగారు. ప్రస్తుతం 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో వారి సంఖ్య 4.4 రెట్లు పెరిగింది.

మరిన్ని విశేషాలు.. 
గోపిచంద్‌ హిందుజా (5), దిలీప్‌ సంఘ్వి (6), ఎల్‌ఎన్‌ మిట్టల్‌ (7), కుమార మంగళం బిర్లా (9), నీరజ్‌ బజాజ్‌ (10) టాప్‌ టెన్‌లో ఉన్నారు. 
డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ సంపద 18 శాతం క్షీణించి రూ. 1.43 లక్షల కోట్లకు పడిపోవడంతో ఆయన 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు.  
అసమానతలు పెరిగిపోతుండటంపై ఆందోళన నేపథ్యంలో ఏడాది వ్యవధిలో 51 మంది కుబేరుల సంపద రెట్టింపయ్యింది. అంతక్రితం ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య 24గా నమోదైంది. 
నగరాలవారీగా చూస్తే 328 బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ (199), బెంగళూరు (100), హైదరాబాద్‌ (87) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలిసారిగా టాప్‌ 20 నగరాల్లో తిరుప్పూర్‌ చోటు దక్కించుకుంది. 
ప్రైవేట్‌ ఈక్విటీ రంగం నుంచి తొలిసారిగా కేదార క్యాపిటల్‌కు చెందిన మనీష్‌ కేజ్రివాల్‌ చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద రూ. 3,000 కోట్లు. 
 ప్రెసిషన్‌ వైర్స్‌కు చెందిన మహేంద్ర రాఠిలాల్‌ మెహతా 94 ఏళ్ల వయస్సులో లిస్టులో నిలిచారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా...
టాప్‌ 100లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రూ. 55,700 కోట్ల సంపదతో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ అధినేత మురళి దివి 23వ ర్యాంకులో నిల్చారు. 196% సంపద వృద్ధితో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాకు చెందిన పీవీ పిచ్చిరెడ్డి (రూ. 37,300 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ. 35,800 కోట్లు)  వరుసగా 37, 41వ ర్యాంకుల్లో ఉన్నారు. హెటిరో గ్రూప్‌ చైర్మన్‌ బి. పార్థసారథి రెడ్డి కుటుంబం రూ. 21,900 కోట్ల సంపదతో 93వ స్థానంలో, అరబిందో ఫార్మా నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపదతో 98వ స్థానంలో, అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లతో 99వ ర్యాంకులో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement