మీరు ఇన్‏కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే ఇది మీకోసమే.. ఇదొక రాచమార్గం

How To Tax Plan And What Are The Benefits In Telugu - Sakshi

దసరా, దీపావళి పండగలు వెళ్లిపోయాయి. ఇక పెద్ద ఖర్చులు ఉండవు. అయితే, పన్ను కూడా ఒక ఖర్చులాంటిదే కాబట్టి ఇక నుంచి ట్యాక్స్‌ ప్లానింగ్‌ వైపు ఒక లుక్‌ వేద్దాం. పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇదొక రాచమార్గం. చట్టబద్ధంగా, సగౌరవంగా, సక్రమంగా, సరైన దారిలో నడుస్తూ మనం మన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అవకాశం ఉంటే పన్ను భారమే లేకుండా కూడా ప్లాన్‌ చేసుకోవచ్చు. తప్పనిసరి అయితే సకాలంలో చెల్లించి, సకాలంలో రిటర్ను వేసి సజ్జనులమని సంబరపడొచ్చు. 

ట్యాక్స్‌ ప్లానింగ్‌ అవసరమా? 
దైనందిన జీవితంలో ముందుచూపు ఎలా ఉండాలో ట్యాక్స్‌ విషయంలోనూ ముందు చూపు అవసరం. దీన్నే ప్లానింగ్‌ అంటారు. చట్టప్రకారం ఎటువంటి తప్పులు చేయకుండా, పొరపాట్లు దొర్లకుండా, ఎటువంటి అడ్డదార్లు తొక్కకుండా, గోల్‌మాల్‌ గోవిందం గారిలాగా కాకుండా .. రాముడు మంచి బాలుడిలాగా పన్ను భారాన్ని తగ్గించుకోవడం అవసరమే.  
ప్రయోజనాలు ఉన్నాయా? 
ఎందుకు లేవు మాస్టారూ! ట్యాక్స్‌ ప్లానింగ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

పన్ను తగ్గుతుంది. ఆ మేరకు మిగిలినట్లే. 

► సరైన మొత్తం సకాలంలో చెల్లించేస్తే .. అధిక మొత్తం చెల్లించి ఆ తర్వాత రిఫండు కోసం చకోర పక్షుల్లాగా ఎదురు చూడాల్సిన బాధ తప్పుతుంది. 

► తక్కువ చెల్లించి, ఆ తర్వాత విషయం తెలిసి అనవసరంగా వడ్డీలు కట్టక్కర్లేదు. పన్ను భారమే తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు వడ్డీలు చెల్లించాల్సిన అవసరమే లేదు. 
► ఆలోచించి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఇల్లు జాయింట్‌ ఓనర్‌షిప్‌ అయితే ఇంటద్దెను ఆదాయంగా భావించినప్పుడు అద్దెను ఇద్దరికి విడగొట్టి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జాయింటు బ్యాంకు అకౌంటులోని వడ్డీలు, జాయింటుగా ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్ల మీద వడ్డీ విషయంలో కూడా ఇలా చేయొచ్చు. 

 మీరు ఏ శ్లాబులో ఉన్నారో ఆ శ్లాబు దాటకుండా .. తక్కువ శ్లాబులోనే ఉండేలా ఆదాయాన్ని పోస్ట్‌పోన్‌ చేసుకోవచ్చు లేదా సర్దుబాటు చేసుకోవచ్చు. 

సెక్షన్‌ 80సిలో ఎన్నో తగ్గింపులు ఉన్నాయి. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి పరిమితి రూ. 1,50,000. వీటిలో ఏది కంపల్సరీనో అది చేసి మిగతాది ఇతర కుటుంబ సభ్యులకు చేయవచ్చు. 

 పిల్లలకు చదువుల ఫీజు విషయంలో కేవలం ఇద్దరు పిల్లలకే ఇస్తారు. ఇద్దరి ఫీజు ఒకరి ఆదాయంలో నుంచి, మిగతావారివి వేరే కుటుంబ సభ్యుల ఆదాయంలో నుంచి క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

 ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌ ద్వారా వచ్చే వడ్డీని పోస్ట్‌పోన్‌ చేసుకోవచ్చు. 

 వ్యాపారస్తులు కొన్ని ఖర్చులను అదుపులో ఉంచుకుని ఏ ఖర్చు మీద మినహాయింపు ఉందో వాటి మీదే ఖర్చు పెట్టవచ్చు. 

 అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, ఇల్లు కట్టడం లాంటి లాంగ్‌టర్మ్‌ ప్రాజెక్టులు, షార్ట్‌ టర్మ్‌లో మెడిక్లెయిమ్, డొనేషన్లు వంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top