పాత ఇల్లు అమ్మకం.. పన్ను రాయితీ పొందడానికి మార్గాలు

How To Get Tax Exemption When House Sold - Sakshi

దీర్ఘకాలిక మూలధన లాభాలని ఆదాయంగా భావించి పన్నుభారం లెక్కేస్తారు. ఇతర ఆదాయాలలో కలపకుండా, ఈ లాభం మీద ప్రత్యేక రేట్ల ప్రకారం లెక్కలు వేస్తారు. స్పెషల్‌ రేటు 20 శాతం, సెస్సు అదనం. పన్ను భారం లేకుండా బైటపడాలంటే మరో ఇల్లు కొనండి లేదా నిర్దేశించిన క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయండి. కింది పేర్కొన్న ఉదాహరణలు ఒకసారి గమనించండి (డిపార్ట్‌మెంట్‌ సౌజన్యంతో)..  
∙ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి? 
కేవలం వ్యవహారంతో ముడిపడ్డ లాభం మాత్రమే ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అమ్మగా వచ్చిన మొత్తం కాదు. ఉదాహరణకు ఇల్లు అమ్మగా వచ్చిన ప్రతిఫలం రూ. 90,00,000 అనుకోండి. లెక్కల ప్రకారం దీనిలో మూలధనం లాభం రూ. 22,00,000 అనుకోండి. కొత్త ఇంటి నిమిత్తం కేవలం రూ. 22 లక్షలు వెచ్చిస్తే సరిపోతుంది.  
∙రెండు ఇళ్ల మీద లాభం వెచ్చించవచ్చా?  
మూలధన లాభాలు రూ. 2 కోట్లకు లోబడి, గడువు తేదీ లోగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. అయితే, ఇలా ఒకేసారి రెండు ఇళ్లకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. మూలధన లాభం రూ. 2 కోట్లు దాటితే, రెండు ఇళ్లు అనుమతించరు. కొత్తవి రెండు ఇళ్లు ఒకేసారి కొనాలనేమీ లేదు. వెనుకా ముందు అయినా ఫర్వాలేదు. కానీ నిర్దేశించిన గడువు లోపల లావాదేవీ జరగాలి. అంటే 3 సంవత్సరాల లోపు గానీ లేదా ఒక సంవత్సరం ముందు/రెండు సంవత్సరాల లోపు గానీ జరగాలి.  
∙మినహాయింపు ఎంత ఇస్తారు?  
మినహాయింపు మొత్తం మూలధన మొత్తాన్ని దాటదు. మొత్తం మూలధన లాభాలను ఇన్వెస్ట్‌ చేయాలి. లేదా ఎంత చేస్తే అంతకే మినహాయింపు పరిమితం అవుతుంది. మూలధన లాభం రూ.50,00,000 అనుకోండి.. రూ. 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటేనే పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. కేవలం రూ.40 లక్షలు పెట్టి కొంటే.. మినహాయింపు కూడా అంతకే పరిమితమవుతుంది.  
∙పైన ఉదాహరణకు మరో మార్గం ఉందా? 
ఇల్లు కొనే బదులు మీరు క్యాపిటల్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మినహాయింపు ఇస్తారు. రూ. 40,00,000 పెట్టి ఇల్లు కొని మిగతా రూ. 10,00,000 పెట్టి బాండ్లు కొన్నా మీకు పూర్తి మినహాయింపునిస్తారు. 
∙గడువు తేదీలోగా ఇల్లు కొనలేకపోతే?  
ఏవైనా ఇతరత్రా కారణాల వల్ల ఇల్లు కొనలేకపోయినా లేదా కట్టుకోలేకపోయినా గాభరా పడక్కర్లేదు. ఆయా సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేసే గడువు తేదీ లోపల మూలధన లాభాన్ని బ్యాంకులో ‘క్యాపిటల్‌ గెయిన్‌ అకౌంట్‌ స్కీమ్‌‘లో డిపాజిట్‌ చేయాలి. ఇలా సకాలంలో డిపాజిట్‌ చేస్తే ఆ మొత్తం మీద మినహాయింపునిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసి ఈ మొత్తాన్ని సకాలంలో వెచ్చించకపోతే మినహాయింపుని రద్దు చేస్తారు. 
∙ఏయే పరిస్థితుల్లో మినహాయింపు పోతుంది?  
కొత్త ఇంటిని 3 సంవత్సరాల లోపల అమ్మేస్తే ముందు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. కాబట్టి హోల్డింగ్‌ పీరియడ్‌ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. (వచ్చే వారం ఉదాహరణలు చూద్దాం)   
- కేసీహెచ్‌ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)

చదవండి: 75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top