ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ హై రికార్డ్‌.. హైదరాబాద్‌లో అత్యధికం | Sakshi
Sakshi News home page

ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ హై రికార్డ్‌.. హైదరాబాద్‌లో అత్యధికం

Published Thu, Sep 28 2023 6:15 PM

Housing sales skyrocket by 36pc in top 7 cities hits record high Anarock - Sakshi

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగి ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేశాయి. స్థిరమైన తనఖా రేటు మధ్య బలమైన డిమాండ్‌తో జూలై-సెప్టెంబర్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు గతేడాది కంటే 36 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1,20,280 యూనిట్లకు చేరుకున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ (Anarock) నివేదిక పేర్కొంది.

(ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!)

హైదరాబాద్‌లో అత్యధికం
అనరాక్‌ నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత ఏడాది కాలంలో గృహాల విక్రయాలు 88,230 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో ఏడు నగరాల్లో సగటు గృహాల ధరలు ఏటా 11 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో ఏటా జులై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల ధరల సగటు పెరుగుదల అత్యధికంగా 18 శాతం ఉంది.

(అపార్ట్‌మెంట్‌ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?)

ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో త్రైమాసిక విక్రయాలు ఆల్‌టైమ్ హైని తాకినట్లు అనరాక్ హైలైట్ చేసింది. అయితే ఈ నివేదికలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఫ్లోర్‌ల విక్రయాలను చేర్చారు. ప్లాట్లు(ఖాళీ స్థలాలు)ను మాత్రం ఇందులో చేర్చలేదు.

ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఇలా..

  • ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గృహాల విక్రయాలు 2023 జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 14,970 యూనిట్ల నుంచి 6 శాతం పెరిగి 15,865 యూనిట్లకు చేరుకున్నాయి. 
  • ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో ఈ కాలంలో ఇళ్ల విక్రయాలు అత్యధికంగా 46 శాతం పెరిగి 26,400 యూనిట్ల నుంచి 38,500 యూనిట్లకు పెరిగాయి.
  • బెంగళూరులో గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంలో 12,690 యూనిట్ల నుంచి ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 29 శాతం పెరిగి 16,395 యూనిట్లకు చేరుకున్నాయి.
  • పుణెలో ఇళ్ల అమ్మకాలు గరిష్టంగా 63 శాతం పెరిగి 14,080 యూనిట్ల నుంచి 22,885 యూనిట్లకు చేరుకున్నాయి.
  • హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 41 శాతం పెరిగి 11,650 యూనిట్ల నుంచి 16,375 యూనిట్లకు చేరుకున్నాయి.
  • చెన్నైలో ఇళ్ల విక్రయాలు 42 శాతం పెరిగి 3,490 యూనిట్ల నుంచి 4,940 యూనిట్లకు చేరుకున్నాయి.
  • కోల్‌కతాలో గృహాల అమ్మకాలు జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో 4,950 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 5,320 యూనిట్లకు చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement