హౌసింగ్‌ బూమ్‌..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!

High interest rates do not deter home buyers says Bank of Baroda - Sakshi

దీనిపై వినియోగదారుల్లో అవగాహన

గృహ రుణాలకు బలమైన డిమాండ్‌

బీవోబీ పరిశోధన నివేదిక

న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోలు డిమాండ్‌కు అవరోధం కాదని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) అధ్యయన నివేదిక తెలిపింది. రుణ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజమేనన్న విషయమై వారికి అవగాహన ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా వడ్డీ రేట్ల పరంగా ఎటువంటి మార్పుల్లేని విషయం తెలిసిందే. కానీ, ఆర్‌బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రేట్లను పెంచడంతో.. బ్యాంకులు సైతం రేట్లను సవరించాయి.

ఈ నేపథ్యంలో బీవోబీ పరిశోధన నివేదిక ఇళ్ల డిమాండ్, వడ్డీ రేట్లపై దృష్టి సారించడం గమనించాలి. ‘భారత్‌లో గృహ రుణాల తీరు’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత దేశంలో గృహ రుణ రంగం బలంగా నిలబడినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల్లో మంచి వృద్ధి కనిపించడాన్ని ప్రస్తావించింది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రకటించిన మద్దతు చర్యలు, దీనికితోడు ప్రాపర్టీల ధరలు తగ్గడం, తక్కువ వడ్డీ రేట్లు మార్కెట్‌కు కలిసొచ్చినట్టు వివరించింది.  

గృహ రుణాలకు డిమాండ్‌
ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా మారిపోవడం, వృద్ధి పుంజుకోవడం, గృహాలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచనున్నట్టు ఈ నివేదికను రూపొందించిన బీవోబీ ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు. ఈ సానుకూలతలు మద్దతుగా గృహ రుణాలకు మరింత డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశారు. ‘‘అధిక వడ్డీ రేట్లు కొద్ది మంది రుణ గ్రహీతలకు అవరోధం కావచ్చు. కానీ, ఇళ్లకు నెలకొన్న బలమైన డిమాండ్‌ దీన్ని అధిగమిస్తుంది. పైగా వ్యక్తిగత గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్ల ఆటుపోట్లపై అవగాహనతో ఉంటారు. కనుక అధిక రేట్లు వారి కొనుగోళ్లకు అవరోధం కాబోవు’’అని అదితి గుప్తా వివరించారు.  

జీడీపీలో పెరిగిన వాటాయే నిదర్శనం
గడిచిన పదేళ్ల కాలంలో జీడీపీలో బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల గృహ రుణాల రేషియో పెరగడం గృహ రుణాలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనమని ఈ నివేదిక గుర్తు చేసింది. 2010–2011లో జీడీపీలో గృహ రుణాల రేషియో 6.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 9.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో గృహ రుణాల రేషియో 9.8 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి రియల్‌ ఎస్టేట్‌ బలంగా కోలుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల రేషియో జీడీపీలో 11.2 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ‘‘2020–11 నాటికి రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2020–21 నాటికి రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా 14.3 శాతం వృద్ధి నమోదైంది. గృహ రుణాల మార్కెట్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీటి వాటా 61.2 శాతంగా ఉంది.   

2022లో హౌసింగ్‌ బూమ్‌..!
పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు
ఇళ్ల ధరలు పెరిగాయి. గృహ రుణాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా సరే 2022లో ఇళ్ల విక్రయాలు కరోనా ముందు నాటిని మించి నమోదవుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు.. కరోనా ముందు సంవత్సరం 2019లో నమోదైన 2.62 లక్షల యూనిట్లను మించుతాయని అంచనాతో ఉంది. డీమోనిటైజేషన్, రెరా, జీఎస్‌టీ, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఈ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం.

అయితే, రెరా చట్టం కారణంగా కొనుగోళ్ల సెంటిమెంట్‌ మెరుగుపడినట్టు గృహ కొనుగోలుదారుల మండలి ఎఫ్‌పీసీఈ అంటోంది అన్ని ప్రధాన రియల్‌ ఎస్టేట్‌ లిస్టెడ్‌ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి బుకింగ్‌ల పరంగా మంచి గణాంకాలను నమోదు చేయగా, 2022–23లోనూ మెరుగైన విక్రయాలు, బుకింగ్‌ల పట్ల ఆశాభావంతో ఉంది. అయితే, ఆర్‌బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం, బ్యాంకులు ఈ మొత్తాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడంతో స్వల్ప కాలంలో ఇళ్ల విక్రయాలపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇళ్ల ధరల పెరుగుదల ప్రభావం కూడా స్వల్పకాలంలో ఉండొచ్చని అంగీకరించింది. జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సుమారు 5 శాతం మేర పెరగడం గమనార్హం.

పండుగల జోష్‌
అయితే పండుగల సీజన్‌ నుంచి ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చని రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ అంచనాలతో ఉంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ సైతం ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు ఏడు ప్రధాన పట్టణాల్లో (ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె) 2019లో నమోదైన 2,61,358 యూనిట్లను మించుతాయని అంచనా వేసింది. అయితే 2014లో నమోదైన గరిష్ట విక్రయాలు 3.43 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. దేశ హౌసింగ్‌ పరిశ్రమ నిర్మాణాత్మక అప్‌సైకిల్‌ ఆరంభంలో ఉందని మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ ఎండీ, సీఈవో అభిషేక్‌ లోధా తెలిపారు. వచ్చే 10–20 ఏళ్ల కాలానికి వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top