లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

GST monthly collection crosses Rs 1 lakh crore first time in FY21 - Sakshi

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్‌టీ కలెక్షన్స్‌ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్‌టీ రూ.19,193 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్‌ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది.

గతేడాది అక్టోబర్‌లో జీఎస్‌టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్‌టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో గ్రాస్‌ జీఎస్‌టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 31 నాటికి 80 లక్షల జీఎస్‌టీఆర్‌–3బీ రిటర్న్‌లు ఫైల్‌ అయ్యాయని ఫైనాన్స్‌ సెక్రటరీ అజయ్‌ భూషన్‌ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్‌ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్‌వాయిస్‌ జనరేట్‌ అవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top