రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్‌! ఎలా ?

Group of 165 people from Belgian village wins usd151 millions in lottery - Sakshi

న్యూఢిల్లీ: ఎవరైనా ఒక వ్యక్తికి అనూహ్యంగా ఏదైనా మంచి జరిగితే కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటాం. కానీ అనుకోకుండా అదృష్ట దేవత తలుపు తట్టడంతో  గ్రామంలో  ఏకంగా 165మందికి జాక్‌పాట్‌ తగిలింది. బెల్జియంలోని ఒక గ్రామంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది.  దీంతో క్రిస్మస్‌ ముందే వచ్చిందంటూ వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా (15,11,83,056 డాలర్లు) ఒక్కొక్కరికీ  రూ.7.50 కోట్లు జమ అయ్యాయి. ఇదేదో సినిమా స్టోరీలా అనిపించినా..  నిజంగా మిరాకిల్‌  జరిగింది.

వివరాల్లోకి వెళితే ఆంట్‌వెర్ప్‌లోని ఉత్తర బెల్జియంలోని ఓల్మెన్ అనే చిన్న గ్రామానికి చెందిన 165 మంది వ్యక్తులు విజేతలుగా నిలిచారని యూరో న్యూస్ నివేదించింది. యూరో మిలియన్స్ లాటరీలో  ఓల్మెన్‌ వాసులు దాదాపు 165 మందిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఓల్మెన్‌లో దాదాపు 4000 మంది జనాభా  ఉండగా, ప్రతి 24 మందిలో ఒకరు విజేతలు. 

అయితే గ్రామానికి చెందిన ఒక్కొక్కరు కొంత మొత్తాన్నిచందాగా వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్స్‌ను కొనుగోలు చేశారు. అంతే వారికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.1200 కోట్ల విలువైన నగదు గెలుచుకున్నారు. ఫలితంగా ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు రూ.7.50కోట్లు జమయ్యాయి. దీంతో ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌ అంటూ ఆ 165 మంది ఆనందంతో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలుచేస్తున్నప్పటికీ ఇప్పటికి అదృష్టం వరించింది,

మరోవైపు లాటరీ గెల్చుకున్నవారంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని  లాటరీ షాప్ యజమాని విమ్ వాన్ బ్రోకోవెన్ చెప్పాడు. ఇంతమందికి  ఒకేసారి లాటరీ రావడం తనకు కూడా  చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. విజేతలలో ఇరవై ఏళ్ల యువతి తనకు, తన కుక్కల కోసం ఇల్లు కొనాలని యోచిస్తోందని తెలిపాడు.

ఇప్పటివరకు అతిపెద్ద గ్రూప్‌గా ఇంత పెద్దమొత్తంలోలాటరీ గెల్చుకోవడం ఇదే తొలిసారి అని బెల్జియం లాటరీ ప్రతినిధి జోక్ వెర్మోరే వ్యాఖ్యానించారు. అయితే విజేతల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. కేవలం 15 యూరోల పెట్టుబడికిగాను ఈ నగదును గెల్చుకోవడం సంచలనంగా  మారింది. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top