
ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌ను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్నటి పార్లమెంట్ సెషన్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.
ఈ మేరకు ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న నిరుద్యోగ ఆందోళనల మధ్య ఈ హామీ వచ్చింది. ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్స్ వంటి ద్రవ్యేతర విభాగాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మనీ గేమింగ్‌ను పూర్తిగా నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం 45 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌లో నిమగ్నమయ్యారని, మొత్తంగా ఏటా రూ.20,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి. ఇది గణనీయమైన ఆదాయాన్ని త్యాగం చేయడమే అయినా వినియోగదారుల సంక్షేమం, ఆర్థిక రక్షణే ఈ నిషేధానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
మనీ గేమ్స్ ఆడే వారు బాధితులే తప్పా నేరస్థులు కాదని, ఈ గేమ్స్ ప్రకటనదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఎనేబుల్స్‌పై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘గేమ్ మేకర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కేవలం మనీ గేమ్స్‌పైనే పని చేయరు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఇతర ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌పై కూడా పనిచేస్తున్నారు. ఈ విభాగాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చాం’ అని ఆయన చెప్పారు.
ఏమిటీ బిల్లు?
అన్ని రకాల ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది.
ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్‌ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు.
ఆన్‌లైన్ గేమ్‌ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.
నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే.
మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్‌లను నిర్వహించినా దోషులే అవుతారు.
ఈ బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్ గేమ్‌ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు.
డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్‌కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది.
సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి.
ఈ–స్పోర్ట్స్‌కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.
మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు.
ఆన్‌లైన్ గేమ్‌లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది.