ఒక్క రోజే ఆఫీసుకు: మీషో మరోసారి బంపర్ ఆఫర్

Good news for Meesho employees One day in office for week - Sakshi

సాక్షి, ముంబై: ఆన్‌లైన్ రిటైల్ స్టార్టప్ మీషో మరోసారి తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. రోజూ ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశిస్తున్నాయి. ఇలాంటి  తరుణంలో  మీషో  వారానికి ఒక రోజు ఆఫీసుకు వస్తే సరిపోతుందని ప్రకటించింది.

వారంలో ఒకరోజు ఆఫీసుకు రండి అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మీషో. వారంలో మిగతా రోజులు ఇంటినుంచే పని చేసు కోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది(2023) జూన్‌ నుంచి ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది. అప్పటివరకు మీషో ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు.  మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్‌ వెల్లడించారు.

ఫ్లెక్సీ-ఆఫీస్ అనేది వారానికి ఒకసారి ఆఫీసుకు, మిగతా రోజులు రిమోట్‌గా పనిచేస్తారని ఇది ఒక టీంగా ఉద్యోగులకు మధ్య సాన్నిహిత్యం పెరగడానికి తోడ్పడుతుందని చెప్పారు.  ఇటీవలి సర్వేలో, మెజారిటీ  ఉద్యోగులు  తమ మధ్య వ్యక్తిగత కనెక్షన్‌ల అవసరం గురించి మాట్లాడారని అందుకే ఫ్లెక్సీ-ఆఫీస్ మోడల్‌ను అవలంబిస్తున్నట్లు  తెలిపారు.

కాగా మీషోలో మొత్తం1850 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 50 శాతం మంది బెంగళూరులో ఉన్నారు. మిగిలిన సిబ్బంది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. తాజా నిర్ణయంతో ఇపుడు వారు బెంగళూరుకు మకాం మార్చాలి లేదా వారానికి ఒకసారి ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top