హెడ్జ్‌ ఫండ్‌ డిఫాల్టుతో బ్యాంకులకు భారీ నష్టాలు

Global banks warn of possible losses from hedge fund default - Sakshi

క్రెడిట్‌ సూసీ, నొమురాలకు షాక్‌  

బెర్లిన్‌: అమెరికాకు చెందిన ఓ హెడ్జ్‌ ఫండ్‌ డిఫాల్ట్‌ కావడంతో పలు పెద్ద బ్యాంకులు భారీగా నష్టాలు నమోదు చేయనున్నాయి.  మార్జిన్‌ కాల్స్‌కి అవసరమైన నిధులను సమకూర్చడంలో సదరు సంస్థ విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్చిగోస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ అనే హెడ్జ్‌ ఫండ్‌ లావాదేవీలు ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం. ‘మార్జిన్‌ అవసరాలకు అనుగుణంగా నిధులు సమకూర్చడంలో ఫండ్‌ విఫలం కావడంతో మా సంస్థ సహా పెద్ద సంఖ్యలో ఇతర బ్యాంకులకు ’గణనీయంగా నష్టాలు’ వాటిల్లాయి అని స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్‌ సూసీ తెలిపింది.

జపాన్‌ దిగ్గజం నొమురా తమ నష్టాలు 2 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. హెడ్జ్‌ ఫండ్లు తమ స్టాక్స్‌ పోర్ట్‌ఫోలియోనూ పూచీకత్తుగా ఉంచి, ట్రేడింగ్‌ అవసరాల కోసం నిధులను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఒకవేళ షేర్ల విలువ పడిపోతే నిర్దేశిత మార్జిన్‌ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తాజాగా ఆర్చిగోస్‌ కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. వయాకామ్‌సీబీఎస్‌తో పాటు పలు చైనా టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌లో ఆర్చిగోస్‌ భారీగా పొజిషన్లు తీసుకుంది. కానీ, వయాకామ్‌సీబీఎస్‌ షేర్ల ధరలు గణనీయంగా పతనం కావడంతో ఆర్చిగోస్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దానికి నిధులిచ్చిన ఆర్థిక సంస్థలపైనా ప్రతికూల ప్రభావం పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top