ఉద్యోగాలు పెరిగే రంగాలివే..జీఐ గ్రూప్‌ నివేదిక | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు పెరిగే రంగాలివే..జీఐ గ్రూప్‌ నివేదిక

Published Mon, May 27 2024 1:52 PM

GI Group Holding India reveals increasing job opportunities in retail and ecommerce

రిటైల్, ఈ-కామర్స్‌ రంగంలో సమీప భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు రాబోతున్నాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు పెద్దమొత్తంలో అవసరమవుతారని రిపోర్ట్‌ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో రిటైల్ రంగంలో 8శాతం ఉద్యోగులు పెరిగారని నివేదించింది. 87శాతం 18-30 ఏళ్ల వయసు ఉన్నవారే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారని చెప్పింది.

నివేదికలోని వివరాల ప్రకారం..ఈకామర్స్, రిటైల్ రంగాలు భారీగా అభివృద్ధి చెందుతున్నాయి. వస్తువులు, ఇతర సేవల డెలివరీని అందించే లాజిస్టిక్స్ రంగం దూసుకుపోతోంది. టైర్ 1 నగరాల్లోని చాలామంది కస్టమర్లు ఈ‍కామర్స్‌, రిటైల్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఆయా రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. 52% రిటైలర్లు ఈ ఏడాది ఫ్రెషర్లను నియమించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 42% ఈ-కామర్స్ కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం చూస్తున్నాయి. 30% రిటైలర్లు మహిళా అభ్యర్థులను ఎంచుకుంటున్నారు. 2024 ప్రారంభంలో లాజిస్టిక్స్‌ రంగలో 10.2% ఉద్యోగాలు పెరిగాయి.

ఇదీ చదవండి: స్లాట్‌లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ

జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా మాట్లాడుతూ..‘భారత్‌ ఆర్థిక వృద్ధిలో రిటైల్‌, ఈకామర్స్‌ రంగాల వాటా పెరిగింది. ఏటా భారత్‌ వర్క్‌ఫోర్స్‌లో చేరే దాదాపు 20 మిలియన్ల యువతలో అధికంగా రిటైల్‌, ఈకామర్స్‌ రంగాన్ని ఎంచుకుంటున్నారు. సప్లై చైన్ కార్యకలాపాలను నిర్వహించడంలో అర్హత కలిగిన అనుభవజ్ఞులకు డిమాండ్‌ ఉంది. కొన్ని కంపెనీలు నిర్దిష్ట ఉద్యోగస్థానాల కోసం మహిళలనే నియమించుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రాణించాలంటే మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. ఈ-కామర్స్ వ్యాపారం డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వంటి అంశాలపై ఆధారపడుతోంది. వీటిపై నైపుణ్యాలు కలిగిఉన్నవారికి సులువుగా కొలువు దొరుకుతోంది’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement