గ్యాస్‌ ధరను పెంచిన కేంద్రం, భారీగా పెరగనున్న రిలయన్స్‌..ఓఎన్‌జీసీల ఆదాయం!

Gas Price Hike Ongc And Reliance Rise In Earnings - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ప్రైవేట్‌ రంగ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం 1.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. 

ఓవైపు మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం తాజాగా ఆయిల్‌ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్‌ రేటును యూనిట్‌కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, మరింత సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్‌ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్‌ ధరను యూనిట్‌కు 3.8 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఏప్రిల్‌ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. గ్యాస్‌ ధర యూనిట్‌కు 1 డాలర్‌ పెరిగితే ఓఎన్‌జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది.

చదవండి: గ్యాస్‌ ధరలు డబుల్‌...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top