ఇంటిపైనే కరెంటు.. వాడుకోవచ్చు.. అమ్ముకోవచ్చు | Hyderabad Fortune Towers Adopts 250 kW Solar Rooftop, Saves ₹3 Lakh Monthly | Sakshi
Sakshi News home page

ఇంటిపైనే కరెంటు.. వాడుకోవచ్చు.. అమ్ముకోవచ్చు

Sep 21 2025 11:06 AM | Updated on Sep 21 2025 11:24 AM

Free Power from Your Rooftop over 3500 Hyderabad Homes Go Solar

ఇంటిపై సౌరకాంతులు!

పెరుగుతున్న నెలవారీ విద్యుత్‌ చార్జీలు

ప్రత్యామ్నాయం దిశగా వినియోగదారుల అడుగులు

గ్రేటర్‌లో రూఫ్‌టాప్‌ నెట్‌మీటరింగ్‌కు పెరుగుతున్న ఆదరణ

అందుబాటులోకి ‘పీఎం ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకం’ పోర్టల్‌

నెలకు 300 యూనిట్లు ఉచితం.. రాయితీపై బ్యాంకు రుణ సౌలభ్యం

హైదరాబాద్‌లోనే అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీగా గుర్తింపు పొందిన మాదాపూర్‌లోని ఫార్చూన్‌ టవర్స్‌పై నిర్వాహకులు 250 కిలోవాట్స్‌ సోలార్‌ రూఫ్‌ టాప్‌ పలకను ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున వెయ్యి యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. నెలకు సగటున రూ.3 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు ఆదా అవుతోంది. ఈ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్వాహకులు పెట్టిన పెట్టుబడి అంతా మరో ఐదేళ్లలో తీరిపోతోంది. ఆ తర్వాత వారికి పూర్తిగా సోలార్‌ విద్యుత్‌ ఉచితంగా అందనుంది. ఇలా వీరొక్కరే కాదు గ్రేటర్‌లో సుమారు 3,500 మంది వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ పలకలను ఏర్పాటు చేసుకుని, సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటున్నారు.

ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్‌తో సొంత అవసరాలు తీర్చుకుంటూ.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లలో సౌర విద్యుత్‌ వెలుగులు నింపే లక్ష్యంతో తాజాగా కేంద్రం ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజ్లీ యోజన’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రేషన్‌కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నెలకు సగటున 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఉచితంగా అందించే కార్యక్రమంలో భాగంగా కొత్తగా రూఫ్‌టాప్‌ సోలార్‌ పలకలు ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి పలు ప్రోత్సాహకాలు అందజేస్తుంది.  –సాక్షి, సిటీబ్యూరో

ఇంటిపై మూడు కిలోవాట్ల సౌరపలకలు ఏర్పాటు చేయాలంటే 225 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. ఒక కిలోవాట్‌ సౌరపలక రోజుకు సగటున 4 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న పలకలు ఏర్పాటు చేసుకుంటే నెలకు సగటున 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4,320 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది.  
    
ఇంటి అవసరాలు నెలకు 200 యూనిట్లు పోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకోవచ్చు. ఇందుకు ప్రస్తుత ధర ప్రకారం యూనిట్‌కు రూ.5.05 చెల్లిస్తుంది. మూడు కిలోవాట్లకు రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. గతంలో రాయితీ కిలోవాట్‌కు రూ.14 వేల చొప్పున మూడు కిలోవాట్లకు రూ.42 వేలు లభించేది. దీంతో చాలామంది విముఖత చూపేవారు. ప్రస్తుతం ఈ సబ్సిడీని రూ.78 వేలకు పెంచింది.

అంతేకాదు మిగిలిన మొత్తం చెల్లింపునకు రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పైసా ఖర్చు లేకుండా యూనిట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్పిత్తి అయిన విద్యుత్‌లో ఇంటి అవసరాలు పోగా, మిగిలిన విద్యుత్‌ను నెట్‌మీటరింగ్‌ ద్వారా డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకు రుణం తీర్చవచ్చు.  

40 మందికిపైగా దరఖాస్తు 
సౌరపలకల జీవితకాలం 25 ఏళ్లను పరిగణలోకి తీసుకుంటే 5.32 సంవత్సరాల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన కాలానికి ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. సౌర విద్యుత్‌తో పర్యావరణ ప్రయోజనాలు లేకపోలేదు. మూడు కిలోవాట్ల సోలార్‌ ప్యానల్ల ఏర్పాటుతో 25 ఏళ్లలో 85 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించిన వారవుతారు. ఇదిలా ఉంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం జాతీయ స్థాయిలో ‘పీఎం సూర్య ఘర్‌’ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్‌ జిల్లాల నుంచి 40 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.  

ఔత్సాహికులు టీఎస్‌ఎస్‌పీడీపీఎల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డిస్కం పేరు, కరెంట్‌ కనెక్షన్, ఫోన్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, ఆధార్‌ నంబర్‌ వంటి వివరాలను పీఎం సూర్యఘర్‌ పోర్టల్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. ఎంపిక చేసిన కంపెనీల సోలార్‌ పలకలు, రాయితీపై రుణాలు ఇచ్చే బ్యాంకులు, టెక్నిషియన్ల్ల వివరాలు ఉంటాయి. పలకల ఇన్‌స్టాలేషన్‌ తర్వాత నెట్‌మీటరింగ్‌ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement