సావరిన్‌ రేటింగ్‌ పెంచండి..!

Finance Ministry to seek ratings upgrade for India in meeting with Moodys - Sakshi

మూడీస్‌ను కోరనున్న ఆర్థికశాఖ

28న కీలక భేటీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– మూడీస్‌ ప్రతినిధులతో సెపె్టంబర్‌ 28న భారత్‌ ఆర్థికశాఖ అధికారులు సమావేశంకానున్నారు. దేశ సావరిన్‌ రేటింగ్‌ పెంపు చేయాలని ఈ సందర్భంగా మూడీస్‌ ప్రతినిధులకు భారత్‌ అధికారులు విజ్ఞప్తి చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్‌ ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చే వీలుంది. దేశం 2021–22 బడ్జెట్‌ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. వచ్చే వారం సమావేశం కూడా ఈ తరహాలో జరుగుతున్నదేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు.

ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్‌...
13 సంవత్సరాల తర్వాత నవంబర్‌ 2017లో భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను మూడీస్‌ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్‌ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్‌ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్‌ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్‌అండ్‌పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్‌ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్‌ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్‌ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఇచ్చే సావరిన్‌ రేటింగ్‌ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను పెట్టుబడిదారులు తీసుకుంటారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top