క్రిప్టోలపై ఆర్‌బీఐతో చర్చలు జరుగుతున్నాయ్‌..

Finance Minister Nirmala Sitharaman Crucial Comments On CryptoCurrency - Sakshi

బ్యాంకింగ్‌ రంగం మెరుగుపడింది 

ఆర్‌బీఐ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి   

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు గురించి రిజర్వ్‌ బ్యాంకుతో చర్చలు జరుగుతున్నాయని, సంప్రదింపుల అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బ్యాంకింగ్‌ రంగ పరిస్థితి మెరుగుపడిందని, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మెరుగ్గా రాణిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మంత్రి ఈ విషయాలు వివరించారు. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయడంపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. మరోవైపు, బోర్డు సమావేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ ..అంతర్జాతీయ సవాళ్లు తదితర అంశాలను బోర్డు సమీక్షించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని.. ఇటు ధరల కట్టడి అటు ఆర్థిక వృద్ధి మధ్య సమన్వయం పాటించే విధానాలను కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలను తట్టుకునేందుకు భారత్‌ వద్ద తగిన స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ వర్గాలు, కొత్తగా నియమితులైన ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఏబీజీ కేసులో తక్కువ సమయంలోనే చర్య
ఏబీజీ షిప్‌యార్డ్‌ దాదాపు రూ. 22,842 కోట్ల మేర మోసానికి పాల్పడినా .. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.  ఏబీజీ తీసుకున్న రుణాలను 2016లో మొండిబాకీలుగా వర్గీకరించగా, ఎస్‌బీఐ 2019లోనే సీబీఐకి తొలి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి అంశాలపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవడానికి 52–54 నెలల సమయం పట్టేస్తుందని.. కాన్నీ అంతకన్నా తక్కువ సమయంలోనే ఫిర్యాదు నమోదైందని స్పష్టం చేశారు. సాంకేతికంగా చూస్తే గత యూపీఏ హయాంలోనే ఏబీజీ డిఫాల్ట్‌ అయ్యిందని పేర్కొన్నారు.

క్రిప్టోలను నిషేధించాల్సిందే: ఆర్‌బీఐ డిçప్యూటీ గవర్నర్‌ రవి శంకర్‌ 
క్రిప్టో కరెన్సీలనేవి పోంజీ స్కీముల కంటే దారుణమైనవని ఆర్‌బీఐ డిçప్యూటీ గవర్నర్‌ టి. రవి శంకర్‌ వ్యాఖ్యానించారు. వీటితో దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలను నిషేధించడం ఒక్కటే పరిష్కారం కాగలదని 17వ వార్షిక బ్యాంకింగ్‌ టెక్నాలజీ కాన్ఫరెన్స్, పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నియంత్రణలను తప్పించుకోవాలన్నదే క్రిప్టో టెక్నాలజీ ప్రధాన ఉద్దేశమని, నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కన్నుగప్పి లావాదేవీలు నిర్వహించేందుకే దీన్ని సృష్టించారని శంకర్‌ తెలిపారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top