ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం | Sakshi
Sakshi News home page

ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం

Published Tue, Aug 25 2020 6:19 AM

Farm prospects rise with good monsoon rains - Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్‌ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆగస్ట్‌ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్‌ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్‌ సీజన్‌ 2020లో 109 మిలియన్‌ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది.  వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది.  

లాభదాయకత కూడా ఎక్కువే..
కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ హేతల్‌ గాంధీ తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్‌ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది.   

ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు
కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్‌ సీజన్‌ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది.  పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది.        
    – హేతల్‌ గాంధీ,  క్రిసిల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌

Advertisement
Advertisement