ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగితే ఫైన్‌ కట్టాల్సిందే.. కొంపముంచిన కక్కుర్తి

Failure Story Of Ashneer Grover and Madhuri Jain Who Sacked From Bharatpe - Sakshi

ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలిచిన యూనికార్న్‌ స్టార్టప్‌గా భారత్‌పే నిలిచింది. నాలుగు బిలియన్‌ డాలర్ల కంపెనీగా ఎదిగిన ఈ స్టార్టప్‌ ఫౌండర్లలో ఒకరైన ఆశ్నీర్‌ గ్రోవర్‌ని అవమానకర రీతిలో కంపెనీ నుంచి తప్పించారు. ఒక ఫౌండర్‌గా ఆయన చేయకూడని తప్పులు చేసినందునే ఇలా జరిగిందంటూ అక్కడి ఎంప్లాయిస్‌ చెబుతున్నారు. 

ఉద్యోగులంటే చులకన
అశ్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లు వ్యవహరించిన తీరు వల్లే ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్టు ఉద్యోగులు చెప్పినట్టు బ్లూంబర్గ్‌ కథనం ప్రచురించింది. ముఖ్యంగా ఎండీ హోదాలో ఉన్న అశ్నీర్‌ గ్రోవర్‌ ఎప్పుడూ ఉద్యోగస్తులతో చులకనగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు. కరోనా టైంలో అన్ని చోట్ల వర్క్‌ఫ్రం హోం అమల్లో ఉంటే భారత్‌పే దాన్ని నిరాకరించింది. ఆఖరికి ఆఫీసులో మాస్కు పెట్టుకోమని అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిని పనిలో నుంచి తీసేశారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఛీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ పోస్టు కోసం ఎంత మందిని ఇంటర్వ్యూ చేసినా ఏ ఒక్కరిని సెలక్ట్‌ చేయకుండా కాలయాపన చేశాడట గ్రోవర్‌.

రూ. కోటి డైనింగ్‌ టేబుల్‌
ఉద్యోగుల పట్ల అగౌరవంగా ఉంటూనే మరోవైపు ఎప్పుడు తన గొప్పలే ఆశ్నీర్‌ గ్రోవర్‌ సాటి ఉద్యోగులకు చెబుతుండేవాడట. ఇప్పుడే కోటి రూపాయలు పెట్టి డైనింగ్‌ టేబుల్‌ కొన్నాను.. నా కారు విలువ మూడున్నర కోట్లు... మా ఇంట్లో కార్పోట్‌ చాలా ప్రత్యేకమైనది ఇలా నిత్యం గొప్పలు చెబుతుంటే వాడట. ఈ వ్యవహారం శృతి మించి మహీంద్రా కోటక్‌ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించే స్థితికి చేరుకున్నాడు గ్రోవర్‌. దీంతో అతని వ్యవహారశైలిపై భారత్‌పే మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించింది.

కక్కుర్తి
ఇక హెడ్‌ ఆఫ్‌ కంట్రోల్స్‌ పోస్టులో ఉన్న మాధురి జైన్‌ ఉద్యోగులను మరో రకంగా వేధించేవారట. ఆఫీస్‌లో అందించే టీ, కాఫీలను ఎవరైనా ఎక్కువగా తాగితే ఫైన్లు విధించేవారట, ఆఫీసులో ఉన్న ప్రింటర్‌ను వ్యక్తిగత పనులకు ఎవరైనా వాడితే జీతంలో కోతలు పెట్టేవారట. అదే సమయంలో కంపెనికి చెందిన కోట్లాది రూపాయల డబ్బును బ్యూటీ ప్రొడక్ట్స్‌, షాపింగ్‌కి ఆమె ఖర్చుపెట్టేవారట. ఇలా ఒక్కో విషయం కలిసి చివరికి మాధురిని కంపెనీ నుంచి తొలగించే వరకు పరిస్థితి వచ్చింది.

వాళ్లకేం తెలుసు
కోటక్‌ మహీంద్రా అధికారితో గొడవ తర్వాత మూడు నెలల లాంగ్‌ లీవ్‌పై వెళ్లిన అశ్నీర్‌ గ్రోవర్‌ చివరకు 2022 మార్చి ఒకటిన భారత్‌పేలో తనకు ఉన్న అన్ని స్థానాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆశ్నీర్‌ స్పందిస్తూ.. ‘లగ్జరీగా జీవితం గడపాలని నేను కలలు కన్నాను. అందు కోసమే కష్టించి పని చేశాను. ఈ రోజు ఖరీదైన నా పరుపు గురించి కామెంట్‌ చేసే వాళ్లకి ఒకప్పుడు భారత్‌పేకు పెట్టుబడులు తెచ్చేందుకు నేను ఫుట్‌పాత్‌ల వెంట తిరిగిన రోజులు తెలియవు. అందుకే వారేమైనా అంటారు’ అంటూ నిప్పులు చెరిగాడు. స్టార్టప్‌ ఫౌండర్లను ఇన్వెస్టర్లు బానిసల్లా చూస్తున్నారంటూ  ఆశ్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌లు మండిపడుతున్నారు.

భారత్‌పే
ఢిల్లీ వేదికగా అశ్నీర్‌ గ్రోవర్‌, శాశ్వత్‌ నక్రానీలు ఫిన్‌టెక్‌ స్టార్టప్‌గా భారత్‌పేను 2018లో స్థాపించారు. అనతి కాలంలోనే భారీ పెట్టుబడులు సాధించి యూనికార్న్‌ కంపెనీగా మారింది. ఆశ్నీర్‌గ్రోవర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాలు ఉండగా అతని భార్య మాధురి జైన్‌ కంట్రోల్స్‌ ఆఫ్‌ హెడ్‌ హోదాలో భారత్‌పేలో కొనసాగింది. ఇటీవల కాలంలో భార్యభర్తలిద్దరు కంపెనీ నుంచి విస్మయం కలిగే విధంగా బయటకు పంపబడ్డారు. 

చదవండి: తప్పు చేస్తే సహించేదేలే ! భారత్‌పే సంచలన నిర్ణయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top