మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలు!

ESIC scheme adds 13.22 lakh new members in August - Sakshi

ఈఎస్‌ఐసీ స్కీమ్‌లో 13.22 లక్షల మంది కొత్త కస్టమర్లు

ఆగస్టు గణాంకాల విడుదల  

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావిత సవాళ్ల తర్వాత దేశంలో క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకంలో ఈ ఏడాది ఆగస్టులో స్థూలంగా 13.22 లక్షల మంది కొత్త సభ్యులు చేరారని తాజా గణాంకాలు వివరించయి. అయితే జూలైతో పోల్చితే (13.33 లక్షల మంది) ఈ సంఖ్య కొంచెం తక్కువ కావడం గమనార్హం. దేశంలో సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ)వెలువరించిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► ఈఎస్‌ఐసీలో  ఏప్రిల్‌లో 10.74 లక్షలు, మేలో 8.88 లక్షలు, జూన్‌లో 10.62 లక్షలు, జూలైలో 13.33 లక్షల మంది కొత్తగా చేరారు.  

► సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షల సడలింపు సానుకూల ప్రభావం తాజా గణాంకాల్లో కనిపిస్తోంది. స్థిరరీతిన క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.

► 2018–19లో కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.49 కోట్లు. 2019–20లో ఈ సంఖ్య 1.51 కోట్లకు చేరింది. 2020–21లో కరోనా ప్రభావంతో 1.15 కోట్లకు పడిపోయింది.  

► ఈఎస్‌ఐసీలో 2017 సెప్టెంబర్‌ నుంచి 2021 మధ్య 5.56 కోట్ల కొత్త చందాదారులు చేరారు.  

► ఈఎస్‌ఐసీ, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ),  పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ద్వారా నిర్వహించబడుతున్న వివిధ సామాజిక భద్రతా పథకాల  కొత్త చందాదారుల పేరోల్‌ డేటా ఆధారంగా ఎన్‌ఎస్‌ఓ నివేదికలు రూపొందిస్తుంది. 2017 సెప్టెంబర్‌ నుంచీ ప్రారంభమైన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ 2018 ఏప్రిల్‌ నుంచి ఈ గణాంకాలను ఎన్‌ఎస్‌ఓ విడుదల చేస్తోంది.  

ఈపీఎఫ్‌ఓకు సంబంధించి ఇలా...
ఇదిలావుండగా నివేదిక ప్రకారం, రిటైర్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ– ఈపీఎఫ్‌ఓలో నికర కొత్త నమోదులు ఆగస్టులో 14.80 లక్షలు. జూలై 2021లో  ఈ సంఖ్య 13.15 లక్షలు. 2017 సెప్టెంబర్‌ నుంచి 2021 ఆగస్టు మధ్య స్థూలంగా కొత్త చందాదారుల సంఖ్య 4.61 కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top