న్యూఢిల్లీ: కొందరు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసులను అడ్డుకుంటున్నారంటూ అమెరికన్ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. 11,000 పైచిలుకు గ్రామాల్లో మొబైల్ కవరేజీ ఇంకా లేదంటూ డాడ్జ్‌డిజైనర్ అనే హ్యాండిల్ పేరిట సోషల్ మీడియా ఎక్స్‌లో వచ్చిన పోస్టుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తూ కొందరు వ్యాపార దిగ్గజాలు, తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు మమ్మల్ని రానివ్వకుండా చేస్తున్నారు.
మీకు తెలుసు వారెవరో. ఇది భారతదేళ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘోర అపరాధం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మే 2026 నాటికి భారత్‌లో 11,256 గ్రామాలకు 4జీ కవరేజీ లేదని, భారతీయులకు స్టార్‌లింక్ అవసరమని డాడ్జ్‌డిజైనర్ పోస్ట్ చేశారు. మరోవైపు, భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ఎక్స్ ప్రకటించడం గమనార్హం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అధికారికంగా ప్రారంభించనున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


