Edible Oil Price: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు..!

Edible Oil To Get Costlier Amid Russia Invasion of Ukraine - Sakshi

ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో ఇప్పుడు ఆ ప్రభావం అన్నింటి మీద పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు బంగారం ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్, క్రీప్టో మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. అయితే, వాటితో పాటు ఇప్పడు ఉక్రెయిన్-రష్యా సంక్షోభ ప్రభావం వంటనూనె ధరల మీద కూడా పడనుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరగనున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. 80 శాతం సన్-ఫ్లవర్ ఆయిల్‌ను మన దేశం మాజీ సోవియట్ రిపబ్లిక్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. 

గత ఏడాది నవంబర్-అక్టోబర్ మధ్య కాలంలో భారతదేశం మొత్తం 18.93 లక్షల టన్నుల ముడి సన్-ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 13.97 లక్షల టన్నులు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవడం గమనర్హం. ఇంకా, అర్జెంటీనా (2.24 లక్షల టన్నులు), రష్యా (2.22 లక్షల టన్నులు) నుంచి దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు పేర్కొంటునాయి. గణాంకాల ప్రకారం, ఉక్రెయిన్ సన్-ఫ్లవర్ ఆయిల్‌ను భారతదేశానికి ఎగుమతి చేసే ఏకైక ప్రధాన సరఫరాదారు. వంటనూనె తయారీదారుల అత్యున్నత సంస్థ సాల్వెంట్ అండ్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్(సీ) అధ్యక్షుడు అతుల్ చతుర్వేది మాట్లాడుతూ.. వంటనూనె ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. "ఉక్రెయిన్, రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మనదేశానికి వస్తుంది. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల దాని సరఫరాలో అంతరాయం కలిగితే ధరలు ఊహించని స్థాయిలో పేరుగుతాయని భావిస్తున్నారు. మేము నెలకు దాదాపు 2.0 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాము" అని చతుర్వేది అన్నారు. 

ఇప్పటికే  దేశంలో వంటనూనె కొరత ఉన్న సమయంలో ఈ సంక్షోభం తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది అని ఆయన అన్నారు. రిటైల్ మార్కెట్లో శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు రూ.145.03తో పోలిస్తే ప్రస్తుతం లీటరుకు రూ.161.94కు పెరిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రైస్ మానిటరింగ్ సెల్ తెలిపింది. సప్లై ఛైయిన్ అంతరాయం వల్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి అని కూడా పేర్కొంది. అర్జెంటీనా ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ తీర్చే సామర్ధ్యం ఆ దేశానికి లేదు అని చతుర్వేది అన్నారు. 

రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో ఒక ప్రధాన సమస్యగా మారింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంది. అలాగే, మన దేశంలో ఉత్పత్తి పడిపోవడంతో మహారాష్ట్రలోని లాతూర్ హోల్ సేల్ మార్కెట్ వద్ద సోయాబీన్ క్వింటాల్ ధర రూ.6,200గా ఉంటే గత రెండు రోజుల నుంచి క్వింటాల్'కు రూ.7,000/ చేరుకున్నాయి. ఇప్పటికే ఆయిల్ సరఫరాదారులు ఇండోనేషియా ఎగుమతుల ఆంక్షల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పామ్ ఆయిల్ ఎక్కువగా ఈ దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. దక్షిణ అమెరికాలో కరువు కారణంగా సోయా ఆయిల్ ఉత్పత్తి కూడా పడిపోయింది. దీని వల్ల ఇప్పటికే ఆయిల్ సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఈ రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల దెబ్బకి ఆయిల్ వంటనూనె ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతాయో చూడాలి మరి.

(చదవండి: బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top