మూడు రోజుల్లో రూ.8,000 కోట్లు

DLF sells flats in Gurugram project for over Rs 8,000 crore within three days - Sakshi

రియల్టీ చరిత్రలో డీఎల్‌ఎఫ్‌ రికార్డు

1,137 ఫ్లాట్స్, ఒక్కొక్కటి రూ.7 కోట్లు

న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ డీఎల్‌ఎఫ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ గురుగ్రామ్‌లో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రీలాంచ్‌లో ఫిబ్రవరి 15–17 మధ్య కంపెనీ మొత్తం 1,137 ఫ్లాట్స్‌ను విక్రయించింది. వీటి విలువ రూ.8,000 కోట్లకుపైమాటే. ఒక్కో ఫ్లాట్‌ రూ.7 కోట్లకుపైగా ఖరీదు చేస్తున్నాయి. భారత రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇదొక చరిత్ర, రికార్డు అని డీఎల్‌ఎఫ్‌ సీఈవో అశోక్‌ త్యాగి వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.15,000 కోట్ల వ్యాపారం నమోదు చేస్తుందని చెప్పారు. 2021–22లో ఇది రూ.7,273 కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల విరామం తర్వాత గురుగ్రామ్‌ సెక్టార్‌ 63లో ‘ద ఆర్బర్‌’ పేరుతో గ్రూప్‌ హౌజింగ్‌ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ప్రీలాంచ్‌ చేసింది. ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాల్సి ఉండగా వారం ముందుగానే మొత్తం ఫ్లాట్స్‌ను మూడు రోజుల్లో విక్రయించడం విశేషం.

అతిపెద్ద కంపెనీగా..
ఫ్లాట్స్‌ కొనుగోలుకై సుమారు 3,600 మంది ఆసక్తి చూపగా లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేసినట్టు డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. వినియోగదార్ల నుంచి రూ.800 కోట్లు ఇప్పటికే సమకూరిందని వెల్లడించింది. కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులే 90 శాతం ఫ్లాట్స్‌ను దక్కించుకున్నారు. ఎన్నారైల వాటా 14 శాతం. వచ్చే నాలుగేళ్లలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ఆర్బర్‌లో 38–39 అంతస్తుల్లో అయిదు టవర్లను నిర్మిస్తారు. ఒక్కొక్కటి 3,950 చదరపు అడుగుల్లో 4 బీహెచ్‌కే ఫ్లాట్స్‌ రానున్నాయి. మార్కెట్‌ క్యాప్‌లో భారతదేశపు అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్‌ఎఫ్‌.. ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్‌ పరంగా కూడా అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top