డిక్సన్‌ టెక్‌- వీఎస్‌టీ టిల్లర్స్‌.. దూకుడు

Dixon technologies- VST tillers tractors jumps - Sakshi

మార్చి కనిష్టం నుంచి 208 శాతం ర్యాలీ

కొత్త గరిష్టానికి డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేరు

ఆగస్ట్‌లో టిల్లర్లు, ట్రాక్టర్ల విక్రయాల పుష్

‌ 6 శాతం ప్లస్‌- ఏడాది గరిష్టానికి వీఎస్‌టీ టిల్లర్స్‌

ఆటుపోట్ల మధ్య కదులుతున్న మార్కెట్లలో సానుకూల వార్తల కారణంగా అటు డిక్సన్‌ టెక్నాలజీస్‌, ఇటు వీఎస్‌టీ టిల్లర్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వెరసి ఎలక్ట్రానిక్‌ ప్రొడక్టుల కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరర్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. వ్యవసాయ రంగ పరికరాలు, ట్రాక్టర్ల కంపెనీ వీఎస్‌టీ టిల్లర్స్‌ తాజాగా 52 వారాల గరిష్టానికి  గరిష్టానికి చేరింది. ఇకపై ఈ రెండు కంపెనీలూ మెరుగైన పనితీరు చూపగలవన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం..

డిక్సన్‌ టెక్నాలజీస్
ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 8,850 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 8,940ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇటీవలి కనిష్టం నుంచి ఏకంగా 208 శాతం ర్యాలీ చేసింది.  దేశీ ఎలక్ట్రానిక్‌ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌, మొబైల్‌ ఫోన్లు, లెడ్‌ లైటింగ్‌ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది.

వీఎస్‌టీ టిల్లర్స్‌ ట్రాక్టర్స్‌
గత ఐదు రోజుల్లో 18 శాతం బలపడిన వీఎస్‌టీ టిల్లర్స్‌ ట్రాక్టర్స్‌ మరోసారి పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 2.5 శాతం పెరిగి రూ. 1860 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1924 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఆగస్ట్‌ నెలలో ట్రాక్టర్లు, టిల్లర్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఇటీవల ఈ కౌంటర్‌ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెలలో ప్రధానంగా టిల్లర్ల అమ్మకాలు దాదాపు 84 శాతం జంప్‌చేసి 2,638 యూనిట్లకు చేరడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై దృష్టి సారించినట్లు తెలియజేశారు. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 813 యూనిట్ల నుంచి  897 యూనిట్లకు పెరగడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top