
సుదీర్ఘ నష్టాలకు సోమవారం స్టాక్‌మార్కెట్‌లో బ్రేక పడింది. మార్కెట్ సూచీలను తక్షణ కలవరపాటుకు గురి చేసే అంశాలేవీ అంతర్జాతీయంగా, జాతీయంగా చోటు చేసుకోలేదు. మరోవైపు షేర్లు కనిష్టాల దగ్గర లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాల్లో మొదలయ్యాయి. కీలకమైన పదిహేను విభాగాల్లో షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. స్మాల్, మిడ్, లార్జ్ అని తేడా లేకుండా అంతటా సానుకూల వాతావారణమే కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. ఉదయం 10 గంటల సమయంలో 53,405 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోల్చితే ఇప్పటికే సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 1.16 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 0.96 శాతం వృద్ధితో 15,926 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.