రికార్డు స్థాయిలో ‘క్రెడిట్‌ కార్డ్‌’ వినియోగం | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ‘క్రెడిట్‌ కార్డ్‌’ వినియోగం

Published Mon, Jul 17 2023 4:42 AM

Credit card spending hits record high at Rs 1. 4 lakh crore in May - Sakshi

ముంబై: క్రెడిట్‌ కార్డుల వినియోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్‌ కార్డులపై రూ.1.4 లక్షల కోట్లు వ్యయం చేయడమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్‌ కార్డులపై బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండగా, ఈ ఏడాది ప్రతీ నెలా 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నట్టు ఆర్‌బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్‌ కార్డుల సంఖ్య 50 లక్షలకు పైగా పెరిగింది. మే చివరికి మొత్తం 8.74 కోట్లకు కార్డుల సంఖ్య చేరింది.

కొత్తగా జారీ అయిన క్రెడిట్‌ కార్డుల్లో 20 లక్షల యూజర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే గణనీయంగా వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్‌ (వినియోగంలో ఉన్నవి) క్రెడిట్‌ కార్డుల సంఖ్య 8.24 కోట్లు కాగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్‌ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచి్చంది. 2022–23లో ఏడాది అంతటా క్రెడిట్‌ కార్డులపై వినియోగం ప్రతి నెలా సగటున రూ.1.1–1.2 లక్షల కోట్లుగా ఉంటూ వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలకు వచ్చే సరికి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కార్డుపై సగటు వ్యయం రూ.16,144గా ఉంది.  

మొదటి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
మే చివరి నాటికి 1.81 కోట్ల కార్డులతో (వినియోగంలో ఉన్న) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది. క్రెడిట్‌ కార్డు రుణాల పరంగానూ 28.5 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్‌బీఐ కార్డ్‌ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.46 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిటీ బ్యాంక్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో, 1,62,150 లక్షల కొత్త కార్డులు యాక్సిస్‌ బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోకు తోడయ్యాయి. మరోవైపు క్రెడిట్‌ కార్డు రుణాలు గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో, ఈ విభాగంలో నిరర్థక ఆస్తులు (వసూలు కాని బకాయిలు/ఎన్‌పీఏలు) 0.66 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి 2.94 శాతానికి చేరినట్టు ఇటీవలే ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ ఓ నివేదిక రూపంలో వెల్లడించడం గమనార్హం.

Advertisement
 
Advertisement