సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 

CPI inflation slumps to 11 month low in November - Sakshi

తగ్గిన ధరల మంట   

  11 నెలల కనిష్టానికి  రిటైల్‌ ద్రవ్యోల్బణం 

న్యూఢిల్లీ: సామాన్యుడికి ధరల మంట కాస్తంత తగ్గింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో నవంబర్‌ నెలకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే ఏడాది తర్వాత మళ్లీ తక్కువ ధరలు చూస్తున్నాం. కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (వినియోగ ధరల ఆధారిత సూచీ/రిటైల్‌ ద్రవ్యోల్బణం) గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం విడుదల చేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో మాసం. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్‌ వెరిఫైడ్‌ మార్క్‌ షురూ)

అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా ఉంది. 2021 నవంబర్‌ నెలలో ఇది 4.91 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 1శాతం మేర అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా ఆర్‌బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. ఈ నెల మొ దటి వారంలో ముగిసిన తాజా ఎంపీసీ సమీక్షలోనూ కీలక రెపో రేటు 0.35శాతం  మేర పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చూస్తే రెపో రేటు మొత్తం మీద 2.25 శాతం ఎగిసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6శాతం లోపునకు దిగొస్తుందని, రానున్న రోజుల్లో ధరల మంట కాస్తంత  చల్లారుతుందని ఇటీవలి సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. (ఐఐపీ డేటా షాక్‌: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి)

ధరల తీరు...: ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉంటే అది నవంబర్‌ నెలకు 4.67 శాతానికి క్షీణించింది. సీపీఐలో ఆహారోత్పత్తుల వాటా 40 శాతం. కూరగాయల ధరలు 8 శాతం మేర తగ్గాయి. ఇక వంట నూనెల ధరలు 0.63 శాతం, చక్కెర ధరలు 0.25 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలో 12.96శాతం వద్ద ఉంటే, వంట దినుసులకు సంబంధించి 19.52 శాతం, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతం, పప్పులకు సంబంధించి 3.15శాతంగా నమోదైంది. చమురు, పొగాకు, మత్తు కారకాల రేట్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువలోనే ఉన్నాయి. వస్త్రాలు, పాదరక్షల ధరలు 9.83శాతం, ఇళ్ల ధరలు 4.57శాతం పెరిగాయి. ‘డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే  వచ్చే ఫిబ్రవరి సమీక్షలో పాలసీ రేట్ల సమీక్షలో కీలక అంశంగా మారుతుందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ తెలిపారు. ఊహించని విధంగా ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివచ్చినట్టు చెప్పారు.

నవంబర్‌ నెలకు 5.88 శాతం చర్యల ఫలితమే ఇది..: ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా, ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ  నిర్దేశిత గరిష్ట పరిధి అయిన 6 శాతం లోపునకు దిగొచ్చింది. ధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల ఫలితాలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ఇంకా ప్రతిఫలిస్తాయి. – కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top