వచ్చే వారం 2 ఐపీవోలు

Caffeine, Elin Electronics gets Ready to Public Issue - Sakshi

19న కేఫిన్‌ టెక్నాలజీస్‌

20న ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌

న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు రానున్నాయి. ఫైనాన్షియల్‌ సర్వీసుల ప్లాట్‌ఫామ్‌ కేఫిన్‌ టెక్నాలజీస్‌ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 347–366 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్‌ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఐపీవో 20న మొదలై 22న ముగియనుంది. వివరాలు చూద్దాం..

రూ. 1,500 కోట్లకు రెడీ
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కేఫిన్‌ ప్రమోటర్‌ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ ఫండ్‌ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్‌ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్‌ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్‌ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్‌ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్‌)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 16న షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్‌ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్‌ మేనేజర్స్‌ తదితరాలకు ఇన్వెస్టర్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది.

రూ. 475 కోట్లకు పరిమితం
ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఐపీవో ద్వారా రూ. 475 కోట్లు మాత్రమే సమీకరించనుంది. మొదట్లో రూ. 760 కోట్లను సమకూర్చుకోవాలని భావించినప్పటికీ తదుపరి టార్గెట్‌లో కోత పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. తద్వారా ఘజియాబాద్‌(యూపీ), వెర్నా(గోవా)లోని ప్లాంట్ల విస్తరణను చేపట్టనుంది. లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్‌ అప్లయెన్సెస్‌ తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్‌టు ఎండ్‌ ప్రొడక్ట్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top