బీఎండబ్ల్యూ, టాటా టెక్‌ జత 

BMW Group and Tata Tech to form JV to set up automotive software hub in India - Sakshi

సంయుక్త సంస్థ ఏర్పాటుకు రెడీ 

న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్‌ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్, డిజిటల్‌ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్‌ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్‌మెంట్‌ హబ్‌కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి.

ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నాయి. 

ఎస్‌డీవీ సొల్యూషన్లు 
జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్‌ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వాహన(ఎస్‌డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్‌కు డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్‌ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి.

సాఫ్ట్‌వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్, డిజిటల్‌ ఇంజ నీరింగ్‌లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్‌ సీఈవో, ఎండీ వారెన్‌ హారిస్‌ పేర్కొన్నారు. టాటా టెక్‌తో భాగస్వామ్యం ఎస్‌డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌  క్రిస్టోఫ్‌ గ్రోట్‌ తెలియజేశారు.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top