breaking news
Software and Electronic Hub
-
బీఎండబ్ల్యూ, టాటా టెక్ జత
న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్మెంట్ హబ్‌కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి. ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నాయి. ఎస్‌డీవీ సొల్యూషన్లు జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్వేర్ ఆధారిత వాహన(ఎస్‌డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్‌కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి. సాఫ్ట్వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్ నెట్‌వర్క్‌లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజ నీరింగ్‌లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. టాటా టెక్‌తో భాగస్వామ్యం ఎస్‌డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ తెలియజేశారు. -
కొనుగోలు దారులకు ఓలా ఎలక్ట్రిక్ భారీ షాక్..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ వెహికల్స్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కొనుగోలు దారులు ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ఓలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులు ఎన్నోరోజుల నిరీక్షణ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఓలా గత డిసెంబర్ నెలలో స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. అయితే తాజాగా ఓలా డెలివరీ చేసిన ఎస్1,ఫీచర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా క్రూయిస్ కంట్రోల్, హిల్ హోల్డ్, నేవిగేషన్ అసిస్ట్, హైపర్ మోడ్'లలో సాఫ్ట్వేర్ లోపాలతో స్కూటర్ పని తీరు కొనుగోలు దారులు ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే స్పందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాఫ్ట్వేర్లను మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య కాలంలో అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చారు. “క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, నావిగేషన్ వంటి ఫీచర్లు వచ్చే కొద్ది నెలల్లో జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి”అని వరుణ్ దూబే అన్నారు. అంతేకాదు సాంకేతిక లోపం తలెత్తిన ఫీచర్ల సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయడంతో పాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అంటే ఈ ఆరు నెలల పాటు ఈ ఫీచర్లు లేకుండానే వినియోగదారులు తమ స్కూటర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..? -
‘మన జిల్లా - మన ప్రణాళిక’కు 6500 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘మన ఊరు - మన ప్రణాళిక’ ఓ కొలిక్కి వచ్చింది. రానున్న ఐదేళ్లలో జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం ఒక రూపం తీసుకొచ్చింది. గ్రామస్థాయి నుంచి మండలాలు, ఆ తర్వాత జిల్లా స్థాయిలోని ప్రతిపాదనలను కలగలపి ప్రయోగాత్మక ప్రతిపాదనలను సిద్ధం చేశారు జిల్లా ఉన్నతాధికారులు. జిల్లాలో మౌలిక వసతుల కల్పన, సామూహిక ప్రయోజనలే లక్ష్యంగా రూపొందించిన ‘మన ప్రణాళిక’లో కీలక శాఖలకు సంబంధించి రూ.6500 కోట్లకు పైగా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో పారిశ్రామిక అభివృద్ధితో పాటు, కమ్యూనిటీ డెవలప్మెంట్, వైద్య, విద్య సదుపాయాలు, గృహనిర్మాణం, నీటిపారుదల శాఖ, రవాణా సౌకర్యాలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, దళితుల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల, గ్రామీణ నీటి సరఫరా వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి అధికారులకు అందజేశారు. వీటికి సంబంధించి గ్రామ, మండల స్థాయి ప్రతిపాదనలను ఆన్లైన్లో కూడా ఉంచారు. వీటికి సీఎం ఆమోదం తెలిపి బడ్జెట్‌తో తగిన నిధులు కేటాయిస్తే ఐదేళ్ల తర్వాత జిల్లా రూపురేఖలే మారిపోనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లాలో కీలక శాఖల అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన ముఖ్య ప్రతిపాదనలు ఇవే... జిల్లాలో సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్‌కు రూ. 50 కోట్లు. ప్రతి మండలంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇందుకోసం మండలానికి రూ.3 కోట్లు. * జిల్లాలోని పేదలకు కొత్తగా 50 వేలకు పైగా గృహాల మంజూరు. ప్రతి ఇంటి నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షల చొప్పున రూ.1100 కోట్లు. * భారీ నీటిపారుదల సౌకర్యాల కోసం రూ. 450 కోట్లు. అందులో రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకానికి రూ.130 కోట్లు, ఇందిరాసాగర్ ఎత్తిపోతలకు రూ.110 కోట్లు. మధ్యతరహా నీటిపారుదల సౌకర్యాల కల్పనకు రూ.27 కోట్లు. * జిల్లాలోని అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాలో భాగంగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, నల్లాల ఏర్పాట్లకు రూ. రూ.794 కోట్లు. * జిల్లాలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు రెండు ఏరియా ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు. ఇందుకోసం రూ. 900 కోట్ల వ్యయం. * అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, పౌష్టికాహార పంపిణీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాల కోసం రూ.121 కోట్లు. * జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు. ఇందుకోసం రూ.1.5 కోట్ల అంచనా వ్యయం. డీఈవో, డిప్యూటీ డీఈవో కార్యాలయ భవనాల కోసం రూ.2.5 కోట్లు. * భూసార పరీక్ష కేంద్రాలు, వ్యవసాయ శాఖ అ దికారుల భవనాల నిర్మాణం, 100 హెక్టార్లలో విత్తనోత్పత్తి కేంద్రం కోసం రూ.10 కోట్లు. * ఏజెన్సీలో అభివృద్ధి పనుల నిమిత్తం ఐటీడీఏకు రూ. 7 కోట్లు. మార్కెటింగ్ శాఖకు 5 పనుల నిమిత్తం రూ.37 కోట్లు. * జిల్లాలో ఉద్యాన వర్శిటీ ఏర్పాటుకు రూ.1000 కోట్లు. విద్యుత్ సౌకర్యాల కల్పనకు రూ.300 కోట్లు. ఖమ్మంలో కొత్త బస్టాండ్ నిర్మాణం, ఇల్లెందులో బస్‌డిపో ఏర్పాటు కోసం రూ.12 కోట్లు. * ఒక్కోటి 11.70 లక్షల వ్యయంతో జిల్లాలో 39 చోట్ల ధాన్యం గోడౌన్లల ఏర్పాటు. జిల్లా సమాఖ్య భవనాలను రూ.35 ల క్షల వ్యయంతో నిర్మాణం. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక్కోటి రూ.20 లక్షల వ్యయంతో వృద్ధాశ్రమాల ఏర్పాటు, రూ.50 లక్షలతో ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు. * ఒక్కో నియోజకవర్గానికి ఒక పని చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో రూ.75 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం. భద్రాచలం, ఇల్లెందులలోని మత్స్య పరిశోధన కేంద్రాలలో రూ.2.5 కోట్ల వ్యయంతో చేప పిల్లల కేంద్రం ఏర్పాటు. * జిల్లాలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనకు సెట్కంకు రూ.31 కోట్లు. ఎస్సీ నిరుద్యోగ యువత కోసం స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, దళితులకు ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం కోసం రూ.30 కోట్లు.