Investment Plans In 2022: ఆర్థిక భద్రతా అవసరమే..

Best Investment Plans in India 2022 - Sakshi

సిప్‌తో సంపద సృష్టి

ఆర్జన మొదలైన వెంటనే ఆరంభించాలి

పీపీఎఫ్‌కు చోటు ఇవ్వాలి

టర్మ్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నిర్లక్ష్యం చేయొద్దు

రుణాలకు దూరంగా ఉండాలి  

చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్‌ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..!  

రిటైర్మెంట్‌ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్‌ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.   

సిప్‌ ఆరంభం..
తివారి (30) సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్‌ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్‌ కాల్‌ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్‌ చెబితే సిప్‌ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు.

పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్‌ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్‌ ఆరంభించాలి. సిప్‌ అన్నది ఒక్కసారి ఇన్‌స్ట్రక్షన్‌ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్‌ వీలు కల్పిస్తుంది.  

సిప్‌ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్‌క్యాప్‌ విభాగానికి 50–60%, మిడ్‌ స్మాల్‌క్యాప్‌ విభాగానికి 20–30%, డెట్‌ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్‌ అలోకేషన్‌ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్‌ పెట్టుబడులు సైతం మార్కెట్‌ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన
సాగించాలి.

పీపీఎఫ్‌ ఖాతా
డెట్‌ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.

ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్‌ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్‌ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌
తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్‌ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్‌ ఇన్సూరెన్స్‌నే తీసుకోవాలి. టర్మ్‌ ప్లాన్‌ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్‌ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌
అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్‌ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్‌ ప్లాన్‌ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్‌ ప్లాన్‌ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి.

అందుకని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్‌ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్‌ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్‌ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి.  

రుణాలకు దూరం
విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్‌ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం.

ద్రవ్యోల్బణానికి చోటు
సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్‌ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్‌ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్‌ చేసుకోవాలని         నిపుణుల సూచన.  

ఈపీఎఫ్‌ నిధికి ప్రాముఖ్యత  
ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్‌ ఖాతా నంబర్‌ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్‌ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్‌ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్‌ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్‌ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు.  

కాంపౌండింగ్‌  
పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్‌ మ్యాజిక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్‌ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది.    

పొదుపు/పెట్టుబడి
పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్‌ ఖాతాలో బ్యాలన్స్‌పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top