టెక్కీ ఖర్చుల చిట్టా వైరల్‌! | Software Engineer Monthly Budget Sparks Debate On Bengaluru Cost Of Living Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

టెక్కీ ఖర్చుల చిట్టా వైరల్‌!

Apr 23 2026 12:35 PM | Updated on Apr 23 2026 12:50 PM

Bengaluru Cost of Living Shock Even High Paid IT Youth Struggle to Save

దేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం చుక్కలు చూపిస్తోంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఈ మహానగరంలో భారీ జీతాలు తీసుకుంటున్న యువ నిపుణులు సైతం పొదుపు చేయడం గగనమైపోతోంది. తాజాగా, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేజ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆరుషి గార్గ్ అనే 23 ఏళ్ల యువతి తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నెలవారీ బడ్జెట్ ఇలా..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరుషి పంచుకున్న లెక్కల ప్రకారం, ఆమె జీవనశైలికి నెలకు సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయంలో సింహభాగం ఇంటి అద్దెకే వెళ్తుండటం గమనార్హం.

 ఖర్చు వివరాలుఅంచనా మొత్తం (నెలవారీ.రూ ల్లో)
ఇంటి అద్దె17,000
కిరాణా సామాగ్రి5,000
బయట భోజనం3,000 - 6,000
షాపింగ్3,000 - 7,000
మెడిసిన్స్‌, గిఫ్ట్స్‌2,000 - 6,000
పని మనిషి2,000
రవాణా1,000 - 2,000
మొత్తం ఖర్చు30,000 - 35,000

 

‘నేను మరీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నానా?’ అంటూ ఆమె అడిగిన ప్రశ్న నెటిజన్లలో చర్చనీయాంశమైంది.

నెటిజన్ల రియాక్షన్

ఆరుషి పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె బడ్జెట్ చాలా పొదుపుగా ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మెట్రో నగరాల్లోని ఆర్థిక ఒత్తిడిని ఏకరువు పెడుతున్నారు. ‘నేను రూ.50 వేలు సంపాదిస్తే.. అందులో రూ.48 వేలు ఖర్చులకే పోతున్నాయి. అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో అర్థం కావడం లేదు’ అని ఒక యూజర్‌ చెప్పారు. ‘ఇది ఒక మెట్రో సిటీలో ఉండాల్సిన సాధారణ బడ్జెట్. బెంగళూరు వంటి నగరాల్లో ఇంతకంటే తక్కువ ఖర్చుతో జీవించడం కష్టం’ అని ఇంకొకరు చెప్పారు.

ఆదాయం ఉన్నా ఆదా సున్నా

ఐటీ ఉద్యోగులతోపాటు అధిక జీతాలు తీసుకునే వారు కూడా ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతున్నారో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ విశ్లేషించారు. లింక్డ్‌ఇన్‌లో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘నెలకు రూ.1.2 లక్షలు సంపాదిస్తున్నా రూపాయి కూడా పొదుపు చేయలేని వారిని నేను చూశాను. దీనికి కారణం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ (జీవనశైలి ద్రవ్యోల్బణం). ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా అనవసరమైన ఖర్చులు కూడా పెంచుకుంటూ పోవడమే పెద్ద సమస్య’ అని మీనాల్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

Advertisement
 
Advertisement
Advertisement