జాతీయ రహదారులపై వాహనాలు వేచి ఉండే సమయాన్ని, రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పడికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో కూడా వాహనాలు టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. తద్వారా రోడ్డుపై కొంత ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీనిని కూడా నివారించడానికి ప్రభుత్వం ఎంఎల్ఎఫ్ఎఫ్ (MLFF) సిస్టం తీసుకొస్తోంది.
హైవేలపై రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. భారతదేశంలో త్వరలోనే టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టైమ్స్ డ్రైవ్ ఆటో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 చివరి నాటికి భారత రహదారులపై టోల్ ప్లాజాలను తొలగించే అవకాశం ఉంది.
అయితే.. 2026 చివరి నాటికి ఎంఎల్ఎఫ్ఎఫ్ (మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో) అనే కొత్త టోల్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని గడ్కరీ తెలిపారు. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. రహదారిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాంట్రీలు, కెమెరాలు, సెన్సార్లు, ఫాస్ట్‌ట్యాగ్ రీడర్లు వాహనాలను గుర్తించి.. టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా డిజిటల్ పద్ధతిలో వసూలు చేస్తాయి.
ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద ఉండే భారీ క్యూలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. వాహనాలు ఆగకుండా ప్రయాణించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. దీని ద్వారా కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రయాణ సమయం తగ్గి, హైవే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలు హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు అంతగా అనుకూలంగా లేవని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. చాలాసార్లు టోల్ చెల్లింపుల విషయంలో వాదనలు, సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం పూర్తిగా ఆటోమేటెడ్, బ్యారియర్‌లెస్ టోల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ కొత్త విధానములో కూడా ఫాస్ట్‌ట్యాగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాహనంలో సరైన ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే లేదా బ్యాలెన్స్ తక్కువగా ఉంటే వాహన యజమానికి యధావిధిగా ఈ-నోటీసులు అందుతాయి. నిర్ణీత సమయంలో టోల్ చెల్లించకపోతే రెట్టింపు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రతి వాహనదారుడు తన ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.
ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి


