
రూ. 4,385 కోట్లతో 18 శాతం కొనుగోలు
మరో 26 శాతం వాటాకు ఓపెన్ ఆఫర్
షేరుకి రూ. 236 చొప్పున కొనుగోలుకి సై
ఆఫర్‌కు మరో రూ. 5,764 కోట్ల వెచ్చింపు
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం బెయిన్ క్యాపిటల్ బంగారంపై రుణాలందించే మణప్పురం ఫైనాన్స్‌లో 18 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 4,385 కోట్లు వెచ్చించనుంది. తద్వారా గోల్డ్ లోన్ కంపెనీ ప్రమోటర్ సంస్థలలో ఒకటిగా అవతరించనుంది. దీంతో నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 236 చొప్పున ధర నిర్ధారించింది. ఇందుకు మరో రూ. 5,764 కోట్లు కేటాయించనుంది. వెరసి విసర్తించిన తదుపరి మణప్పురం ఫైనాన్స్ చెల్లించిన మూలధనంలో 41.7 శాతానికి బెయిన్ వాటా బలపడనుంది.
6 నెలల సగటు ధర
ప్రిఫరెన్షియల్ పద్ధతిలో బెయిన్‌కు ఈక్విటీతోపాటు.. వారంట్లను మణప్పురం కేటాయించనుంది. గత ఆరు నెలల సగటు ధరకంటే 30% అధిక(ప్రీమియం) ధరతో వీటిని జారీ చేయనుంది. వీటితో విస్తరించనున్న కంపెనీ ఈక్విటీలో బెయిన్‌కు 18% వాటా లభించనుంది. తద్వారా మణప్పురం ఫైనాన్స్‌లో సహప్రమోటర్ కానుంది. దీంతో వారంట్లు మినహా మిగిలిన ఈక్విటీ నుంచి సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ పూర్తిగా విజయవంతమైతే బెయిన్ వాటా వారంట్ల మారి్పడి తదుపరి 41.7%కి బలపడనుంది. ఇదే సమయంలో ప్రస్తుత ప్రమోటర్ల వాటా 28.9 %కి చేరనుంది. అయితే ఈ లావాదేవీలకు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది.
1949లో ఆవిర్భావం: ఎన్‌బీఎఫ్‌సీ.. మణప్పురం ఫైనాన్స్ 1949లో కేరళలో ఏర్పాటైంది. 5,357 బ్రాంచీలుసహా 50,795 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ మైక్రో, వాహన, గృహ, ఎస్‌ఎంఈ ఫైనాన్స్‌లోకి సైతం విస్తరించింది.
షేరు 8 శాతం జూమ్...
సాధారణ వాటాదారులకు బెయిన్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేరు 7.7 శాతం జంప్‌చేసి రూ. 234 వద్ద ముగిసింది. ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 248కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం.