టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు

Auto sales see strong growth in December - Sakshi

డిసెంబర్‌లో జోరుగా వాహన అమ్మకాలు 

పండుగ సీజన్‌ ముగిసినా తగ్గని డిమాండ్‌ 

వ్యాక్సిన్‌ ఆశలతో మరింత మెరుగ్గా విక్రయాలు 

వాహన కంపెనీల ఆశాభావం  

వాహన విక్రయాలు డిసెంబర్‌లో దుమ్ము రేపాయి. డిమాండ్‌ జోరుగా ఉండటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌ కంపెనీల వాహన అమ్మకాలు(హోల్‌సేల్‌) రెండంకెల మేర వృద్ధి చెందాయి. హ్యుందాయ్, సోనాలిక ట్రాక్టర్స్‌ కంపెనీలు అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను డిసెంబర్‌లోనే సాధించాయి. వినియోగదారుల ఆర్డర్లు చెప్పుకోదగ్గ స్థాయిల్లో పెరుగుతున్నాయని, రిటైల్‌ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వాహన కంపెనీలు వెల్లడించాయి. పండుగల సీజన్‌ ముగిసిన తర్వాత కూడా అమ్మకాలు జోరుగానే ఉన్నాయని వాహన కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి. మార్కెట్‌ వేగంగా రికవరీ అయిందని, వ్యక్తిగత రవాణాకు డిమాండ్‌ పెరుగుతుండటం కలసివచ్చిందని పేర్కొన్నాయి. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుండటంతో వినియోగదారుల సెంటిమెంట్‌ మరింతగా మెరుగుపడి, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న  ఆశాభావం వాహన పరిశ్రమలో నెలకొన్నది.  

మరిన్ని విశేషాలు...
► హ్యుందాయ్‌ కంపెనీకి అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను గత నెలలోనే సాధించింది. క్రెటా, వెర్నా, టూసన్, ఐ20 మోడళ్లలో కొత్త వేరియంట్లను అందించడం, క్లిక్‌టుబై వంటి
వినూత్నమైన సేవలందించడం కారణంగా అమ్మకాలు జోరుగా పెరిగాయని
ఈ కంపెనీ పేర్కొంది.  

► మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ దేశీయ అమ్మకాలు 3 శాతం పెరిగినా,
మొత్తం అమ్మకాలు 10 శాతం తగ్గాయి.  

►  వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌ దేశీయ అమ్మకాలు 8 శాతం తగ్గినా,
ఎగుమతులు 24 శాతం ఎగిశాయి. మొత్తం అమ్మకాలు 3 శాతం తగ్గాయి.  

► అమ్మకాలు గత ఆరు నెలలుగా పెరుగుతూనే ఉన్నాయని యమహా తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top