అంబానీయే భారత్‌కు బాసా?! | Is Ambani the Real Boss of India, Elon Musk Sparks Massive Telecom Controversy | Sakshi
Sakshi News home page

అంబానీయే భారత్‌కు బాసా?!

Oct 8 2026 8:57 PM | Updated on Oct 8 2026 9:14 PM

Is Ambani the Real Boss of India, Elon Musk Sparks Massive Telecom Controversy

న్యూఢిల్లీ:  భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత్‌ టెలికాం రంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ‘స్టార్‌లింక్’ సంస్థకు భారత్‌లో లైసెన్స్ మంజూరు కావడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన నేరుగా ముఖేష్ అంబానీ పేరును ప్రస్తావిస్తూ సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  

భారత్‌లో దశాబ్దాలుగా టెలికాం, డేటా రంగం ఎదుగుదలపై ప్రముఖ డేటా సెంటర్ నిపుణుడు గగన్‌దీప్ సింగ్ సప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..‘నేను భారత్‌లో గత 30 సంవత్సరాలకు పైగా డేటా కేంద్రాలను నిర్మించి నడుపుతున్నాను. మన దేశంలో ఇంటర్నెట్ డైల్ అప్ దశ నుండి గిగాబిట్ వేగంగా ఎదగడాన్ని నేను కళ్లారా చూశాను. అదే సమయంలో ఇక్కడ పోటీని ఎలా అడ్డుకుంటున్నారో కూడా నేను చూశాను’అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌పై డాక్టర్ అనిరుద్ధ మలపాణి స్పందిస్తూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.‘సామాన్య పౌరుల ప్రయోజనాల కంటే బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికే ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది’ అని ఆయన మండిపడ్డారు. అనిరుద్ధ మలపాణి చేసిన ఈ వ్యాఖ్యలను, ఇతర చర్చలను ఉటంకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు.

‘ప్రపంచవ్యాప్తంగా 165 దేశాలకు పైగా స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క చట్టాన్ని, నిబంధనను గత ఐదేళ్లుగా మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అయినప్పటికీ ఇప్పటివరకు లైసెన్స్ ఎందుకు రాలేదు? భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా? అని ప్రశ్నించారు.    

అసలు నేపథ్యం 
ప్రపంచంలోని అత్యంత లాభదాయకమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెలికాం మార్కెట్లలో భారత్‌ ఒకటి. ఇక్కడ జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. తమ సంస్థ దేశవ్యాప్తంగా గేట్‌వేలను ఏర్పాటు చేసి, అన్ని భద్రతా నిబంధనలను పాటించినప్పటికీ కేవలం కొన్ని కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యాన్ని కాపాడటానికే అనుమతులు అడ్డుకుంటున్నారని మస్క్ పరోక్షంగా ఆరోపిస్తున్నారు.

కాగా, స్టార్‌లింక్ ఆరోపణలను తోసిపుచ్చిన కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, అన్ని లైసెన్స్ ప్రక్రియలు,భద్రతా తనిఖీలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఒక విదేశీ టెలికాం దిగ్గజం నేరుగా దేశీయ పారిశ్రామిక దిగ్గజం పేరును ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement