ఇక అమెజాన్లో సిల్క్ మార్క్ చీరలు

Amazon signs MOU with Silk mark organisation - Sakshi

సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ తో అమెజాన్ ఎంవోయూ

ఆర్గనైజేషన్లో నమోదైన విక్రేతల ప్రొడక్టులు అందుబాటులోకి

తొలి దశలో 3,000 రకాల ఉత్పత్తులవరకూ విక్రయం

ఉత్పత్తులకు సిల్క్ హాలోగ్రామ్, ప్రత్యేక నంబర్

ప్యూర్ సిల్క్ ప్రొడక్టులను వినియోగదారులకు అందించేందుకు వీలుగా దేశీ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్(SMOI)తో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్  తాజాగా పేర్కొంది. తద్వారా సిల్క్ మార్క్ లేబుళ్లతో కూడిన ప్రొడక్టుల విక్రయానికి ప్రత్యేకించిన సిల్క్ మార్క్ స్టోర్ ను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. సిల్క్ ఆర్గనైజేషన్లో నమోదైన వివిధ చేనేత, తదితర కళాకారులకు చెందిన పలు ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. దేశవ్యాప్తంగా సిల్క్ మార్క్ ను వినియోగించేందుకు 4,200 మది కళాకారులు అర్హత కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.  

తొలి దశలో
ఎంవోయూలో భాగంగా తొలి దశలో 100 శాతం ప్యూర్ సిల్క్ తో తయారైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్ కమీజ్ సెట్స్, జాకెట్లు, షర్టులు తదితర 3,000 ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా అమెజాన్ కారిగర్, అమెజాన్ ఇండియా బజార్ స్టోర్ల ద్వారా ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను అమెజాన్ విక్రయించనున్నట్లు కేంద్ర సిల్క్ బోర్డ్ సీఈవో రంజన్ ఖాండియర్ పేర్కొన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ప్యూర్ సిల్క్ లేబుళ్లుగల ప్రొడక్టులను ప్రజలకు అందించే వీలున్నదని తెలియజేశారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అమెజాన్తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. కేంద్ర సిల్క్ బోర్డు ద్వారా జారీ అయ్యే సిల్క్ మార్క్ సర్టిఫికేషన్లో భాగంగా హాలోగ్రామ్, ప్రత్యేక నంబరుతో ఈ ప్రొడక్టులు లభిస్తాయని తెలియజేశారు. కాగా..  SMOI ద్వారా ఉత్పత్తులను విక్రయించేవారికి మార్కెటింగ్, సేల్స్ సపోర్ట్, సాంకేతిక శిక్షణ తదితర అంశాలలో మద్దతు లభిస్తుందని అమెజాన్ వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top