డమ్మీ గన్‌ ప్రాణాలు తీయడమేంటి? | Alec Baldwin fatally shoots Woman Incident Is Prop Gun Really Kills | Sakshi
Sakshi News home page

ప్రాప్‌ గన్‌ విషాదాలు.. పాపం బ్రూస్‌లీ కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా?

Oct 23 2021 8:05 AM | Updated on Oct 23 2021 1:17 PM

Alec Baldwin fatally shoots Woman Incident Is Prop Gun Really Kills - Sakshi

కొడుకు బ్రాండన్‌ లీతో బ్రూస్‌ లీ (పాత చిత్రం)

సినిమా షూటింగ్‌లో వాడే గన్‌లు డమ్మీవి అనుకుంటాం. కానీ, అలెక్ బాల్డ్‌విన్‌ చేతిలో సినిమాటోగ్రఫర్‌ ప్రాణాలు పోగొట్టుకోవడం విషాదం నింపింది.

సినిమాల్లో వాడే ఆయుధాలు డమ్మీవనే అపోహ చాలామందికి ఉంటుంది. అఫ్‌కోర్స్‌.. అందులో కొంత వాస్తవమూ లేకపోలేదు. సాధారణంగా సినిమాలకు ఉత్తుత్తి తుపాకులనే వినియోగిస్తుంటారు. కానీ, వాటివల్లా ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. తాజాగా ‘రస్ట్’ షూటింగ్ లో డమ్మీ తుపాకీ పేలి  సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) మరణించిన విషయం తెలిసిందే!.  మరి డమ్మీ తుపాకులతో కూడా చనిపోతారా? అనే అనుమానం కలగొచ్చు. వాస్తవానికి ఆ తుపాకులతోనూ తీవ్రమైన పరిణామాలు కలుగుతుంటాయి. టెక్నికల్‌ కోణంలో అదెలాగంటే.. 


వినోద రంగంలో వాడే ఏదైనా మారణాయుధాలను ‘ప్రాప్’ ఆయుధాలు అంటారు.  థియేటర్ ప్రొడక్షన్స్, రేంజ్ కోసం వాటిని వాడుతుంటారు. చాలా మంది అవి పనిచేయవని అనుకుంటారు. కేవలం తుపాకుల్లా కనిపించేవాటిని మాత్రమే వాడుతుంటారని పొరపడుతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో వాడేవి నిజమైన తుపాకులే. యస్‌.. క్లోజప్ షాట్స్ లో ఒరిజినల్‌ ఫీలింగ్‌ కలిగేందుకు వాటిని వాడుతుంటారు. అయితే గన్స్‌ను హ్యాండిల్ చేసే నిపుణుల సమక్షంలోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అద్దెకు తెచ్చేవే అయినా వీటిని ఉపయోగించడానికి అయ్యే ఖర్చు.. దాదాపు రియల్‌ గన్‌లను ఉపయోగించడానికి అయ్యేంతగా ఉంటుందట!.


ప్రాప్ గన్స్‌(ప్రతీకాత్మక చిత్రం)

How Prop Gun Works.. ఇక నిజమైన తుపాకీని వాడేటప్పుడు.. బుల్లెట్లు లేకుండా కేవలం కార్ట్రిడ్జ్‌ను లోడ్ చేస్తారు.  మిగతావన్నీ తుపాకీ సెటప్‌కు తగ్గట్లే ఉంటాయి.  అంటే బుల్లెట్లు లేకపోయినా..  కేసింగ్, గన్ పౌడర్, ఫైరింగ్ పిన్ వంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ క్రమంలో తుపాకీ పేల్చినప్పుడు పెద్ద శబ్దంతో గన్ పౌడర్ మండుతుంది. వీటిని హ్యాండిల్‌ చేయడంలో ఏమైనా పొరపాటు జరిగితే కాల్చేవారికి మాత్రమే కాదు.. దగ్గరగా ఉన్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యే ఛాన్స్‌ ఉంటుంది.
 

ఒక్కోసారి చనిపోవచ్చు కూడా. ‘రస్ట్’ సినిమా షూటింగ్‌లో జరిగింది కూడా ఇదే అని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రాప్ గన్‌ను అలెక్ బాల్డ్‌విన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు.


జోన్‌-ఎరిక్‌ హెక్సమ్‌(ఎడమ), బ్రాండన్‌ లీ(బ్రూస్‌లీ కొడుకు మధ్యలో), హల్యానా హచిన్స్(కుడి)

గతంలోనూ.. 
ప్రాప్‌ గన్‌ విషాదాలు గతంలోనూ జరిగాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ లెజెండ్‌ బ్రూస్‌ లీ కొడుకు బ్రాండన్‌ లీ కేవలం 28 సంవత్సరాల వయసులోనే మృత్యువాత పడ్డాడు. అందుకు కారణం.. ప్రాప్‌ గన్‌.  1993లో ‘ది క్రౌ’ షూటింగ్‌ సందర్భంగా ప్రాప్‌ గన్‌ పేలి చనిపోయాడు.  తుపాకీ పేలిన తర్వాత లీ కుప్పకూలగానే..  అంతా అది నటనేమో అనుకున్నారట.  కానీ, షాట్‌ కట్‌ అయిన తర్వాత కూడా కదలిక లేకపోవడంతో అసలు విషయం గుర్తించి.. ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది.  ఇక 1984లో యూకే నటుడు జోన్‌-ఎరిక్‌ హెక్సమ్‌.. ఓ టీవీ షో సెట్స్‌లో షూటింగ్‌ ఆలస్యం అవుతోందన్న ఫ్రస్టేషన్‌లో జోక్‌ చేయడం ప్రారంభించాడు. కాసేపటికే ఆయన తుపాకీ తలకు గురిపెట్టి షూటింగ్‌ మొదలుపెడతారా? కాల్చుకోమంటారా? అంటూ సరదాగా కామెంట్లు చేశాడు. చివరకు డమ్మీ గన్నే కదా అని ట్రిగ్గర్‌ నొక్కడంతో అది కాస్త ‘ఫాట్‌’మని  పేలి ఆయన్ని గాయపరిచింది. అయితే ఆ దెబ్బకు ఆయన పుర్రెకు బలమైన గాయమైంది. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాక  చివరకు ఆయన ప్రాణాలు విడిచాడు. ఇక ఇప్పుడు పొరపాటున అలెక్ బాల్డ్‌విన్ చేతిలో ప్రాప్‌ గన్‌ పేలి.. హల్యానా హచిన్స్ ప్రాణం విడిచింది.     


బాల్డ్‌విన్‌(ఎడమ), హల్యానా(కుడి)

బాల్డ్‌విన్‌ అరెస్ట్‌ చేయాల్సిందే
ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్‌విన్(63) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్‌లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.  అయితే ఈ ఘటనపై బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో ‘అరెస్ట్‌ చేయాల్సిందేన’ని సోషల్‌ మీడియా కూస్తోంది.  అయితే పోలీసులు మాత్రం పూర్తి దర్యాప్తు అయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.  


పోలీస్‌ స్టేషన్‌ బయట బాల్డ్‌విన్‌

ఘటన జరిగిన వెంటనే బాల్డ్‌విన్‌ స్వయంగా శాంటా ఫే కౌంటీ పోలీస్ స్టేషన్ కు వచ్చారని, విచారణకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆయన తన డిటెక్టివ్ లతో మాట్లాడుతున్నారని, ఘటన గురించి తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చారని పర్సనల్‌ మేనేజర్‌ మీడియాకు తెలిపారు. కాగా, హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్.  కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్‌లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్‌లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ కిందటి ఏడాది రిలీజ్‌ అయ్యింది కూడా. 

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement