బైబ్యాక్‌లతో కాదు... పెట్టుబడులతోనే భవిష్యత్తు
డివిడెండ్లేకాదు గ్లోబల్ డీల్స్‌కు డబ్బు వెచ్చించాలి
ఐటీ కంపెనీల్లా పంచడం కాదు.. వ్యాపారాలు అందిపుచ్చుకోవాలి
ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
ముంబై: గత దశాబ్దకాలంగా పలు దేశీ ఐటీ కంపెనీలు తమ దగ్గరున్న నిధులను ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్‌లు, డివిడెండ్ల రూపంలో పంచేందుకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయని టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. తమ రంగాల్లోని కొత్త తరం వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో అవి విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అయితే, ఎయిర్‌టెల్ ఆ బాటలో వెళ్లదని మిట్టల్ స్పష్టం చేశారు.
టెలికం కంపెనీలు వృద్ధి అవకాశాలు అందించే అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాల్సిందనేనని, లేకపోతే వెనుకబడిపోయే రిస్క్ లు ఉంటాయన్నారు. కాబట్టి తాము ఇటు బైబ్యాక్‌లు, డివిడెండ్లు ఇస్తూనే అంతర్జాతీయంగా టెలికం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిన సందర్భంగా తెలిపారు.
కృత్రిమ మేథ (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యాపార విస్తరణపై ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్‌లు, డివిడెండ్ల రూపంలో తమ దగ్గరున్న నిధులను మరీ ఎక్కువగా వెచ్చిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 16 దిగ్గజ ఐటీ కంపెనీలు, షేర్‌హోల్డర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్ల మొత్తాన్ని బైబ్యాక్‌లు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ. 95,400 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికం.
పదేళ్లలో వారసులకు వ్యాపార పగ్గాలు ..
వచ్చే దశాబ్దకాలంలో వ్యాపార పగ్గాలను తన వారసులకు అప్పగించనున్నట్లు మిట్టల్ చెప్పారు. అలాగే, భారతి ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ సంస్థ భారతి టెలికం తిరిగి 50 శాతం పైగా వాటాను దక్కించుకునేలా చూడాలనేది తన ఆకాంక్ష అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతి టెలికంకి ఎయిర్‌టెల్‌లో 40.47 శాతం వాటాలు ఉన్నాయి. 10 శాతం మేర వాటాలు పెంచుకోవాలంటే ప్రస్తుత షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కనీసం రూ. 1 లక్ష కోట్లు అవసరమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు.


