ఎయిర్‌ఇండియా బాహుబలి!

Air India Introduce New Air Service Flight - Sakshi

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా వాకిట్లోకి మరో కొత్త విమానం వచ్చి చేరింది. అతిపెద్ద బాడీ కలిగిన ఏ350-900 సర్వీస్‌ శనివారం ఎయిర్‌ ఇండియాతో జతైంది. యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ రూపొందించిన ఈ సర్వీసు దిల్లీలోని ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి  వైడ్‌బాడీ విమాన సర్వీసును నిర్వహిస్తున్న సంస్థల్లో ఎయిర్‌ ఇండియానే మొదటిది కావడం విశేషం. దీంతోపాటు వచ్చే మార్చిలోగా మరో 5 విమానాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 20 ఏ350-900 సర్వీసులను ఆర్డర్‌ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్‌ ఇండియా 40 ఏ350ఎస్‌ విమానాలు, 40 ఏ350-900, ఏ350-1000 ఎయిర్‌క్రాఫ్ట్‌లతోపాటు 140 చిన్న సైజు ఏ321, 70 ఏ320 నియో విమానాలకు ఆర్డర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎయిర్ ఇండియా A350-900 విమానం కాన్ఫిగరేషన్‌లు..

  • క్యాబిన్‌లో మెరుగైన సౌలభ్యం కోసం ఫ్లాట్ బెడ్‌లతో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్‌లు ఉన్నాయి.
  • అదనంగా 24 ప్రీమియం ఎకానమీ సీట్లు ఉన్నాయి. 
  • క్యాబిన్‌లో 264 ఎకానమీ క్లాస్ సీట్లున్నాయి.
  • అన్ని తరగతుల్లో హైడెఫినిషన్ స్క్రీన్‌లు అందుబాటులో ఉంచారు. 
  • సుమారు ఇందులో 320 మంది ప్రయాణించవచ్చు.
  • క్రూ సిబ్బంది ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా ఇటీవల రూపొందించిన కొత్త యూనిఫామ్‌లో కనిపించనున్నారు.

ఎయిర్ ఇండియా A350 జనవరి 2024లో వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. ప్రాథమికంగా ఈ సర్వీస్‌ కొన్నిరోజులు దేశీయంగా సేవలందిస్తుందని సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు దీని సేవలను విస్తరించనున్నారు.

ఏటా వెయ్యి కోట్లు ఆదా

భారతీయ వైమానిక దళం అధీనంలో ఉన్న గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానయాన సంస్థలకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న గగనతలంలో 30 శాతం వైమానిక దళం అధీనంలో ఉంది. ఈ గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానం నడిచే సమయం తగ్గనుందని, చమురు వినిమయం, ఉద్గారాలు మరింత తగ్గుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 18 నాటికి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) 1,562 మంది కమర్షియల్‌ పైలెట్లకు లైసెన్స్‌లు జారీ చేసింది. వైమానిక దళం వినియోగిస్తున్న ఏరోస్పేస్‌లో 40 శాతం వృథాగా ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి: వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top