కోయిల గూటి కొమ్మలు.. విశ్వాన్ని శాసించిన శక్తులు! | Adoption And Success, How Steve Jobs, Jeff Bezos, Larry Ellison, And Dave Thomas Rose To Global Billionaire Status | Sakshi
Sakshi News home page

కోయిల గూటి కొమ్మలు.. విశ్వాన్ని శాసించిన శక్తులు!

May 16 2026 8:52 AM | Updated on May 16 2026 10:19 AM

Adopted to Greatness How Steve Jobs Jeff Bezos Larry Ellison Childhood Uncertainty

వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే వ్యూహాత్మక చతురత, సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపించే అద్భుత దార్శనికత, ఎంతటి సంక్షోభంలోనైనా వెనకడుగు వేయని ఉక్కు సంకల్పం.. ప్రపంచ శ్రేణి బిలియనీర్లలో మనం సాధారణంగా చూసే లక్షణాలివి. అయితే, గ్లోబల్ టెక్ ఐకాన్స్ అయిన స్టీవ్ జాబ్స్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్.. ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ థామస్‌ల జీవితాల్లో ప్రపంచానికి పెద్దగా తెలియని, అత్యంత ప్రభావవంతమైన ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. వారంతా ‘దత్తత’ సంతానమే!

అననుకూల పరిస్థితుల నడుమ అస్థిరతలను అధిగమించి దత్తత తీసుకున్న కుటుంబాల ఆదరణతో వారు ఎలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారో వివరించే ప్రత్యేక విశ్లేషణ ఇది.

స్టీవ్ జాబ్స్..

యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పుట్టుక ఒక సంక్లిష్ట పరిస్థితిలో జరిగింది. పీహెచ్‌డీ చేస్తున్న సిరియన్ విద్యార్థి అబ్దుల్ ఫత్తా జందాలీ, స్విస్-జర్మన్ సంతతికి చెందిన జోవాన్ స్కీబుల్ దంపతులకు ఆయన జన్మించారు. అయితే, జోవాన్ తల్లిదండ్రులు వీరి సంబంధాన్ని నిరాకరించడంతో ఆమె ‘క్లోజ్డ్‌ అడాప్షన్‌’ ప్రక్రియను ఎంచుకోవాల్సి వచ్చింది.

మొదట ఒక ధనిక జంట జాబ్స్‌ను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చినా మగపిల్లాడు అని తెలియగానే వెనక్కి తగ్గారు. ఆ తర్వాత శ్రామిక వర్గానికి చెందిన పాల్, క్లారా జాబ్స్ దంపతులు స్టీవ్‌ను దత్తత తీసుకున్నారు. తమ ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అతడిని ఉన్నత చదువులు చదివిస్తామని వారు జాబ్స్‌ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాటిచ్చారు.

తనను పెంచిన తల్లిదండ్రుల పట్ల జాబ్స్ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉండేవారు. వారే నా నిజమైన తల్లిదండ్రులు అని ఆయన గర్వంగా చెప్పుకునేవారు. తనను కన్న తల్లిదండ్రులను కేవలం ఒక స్పెర్మ్, ఎగ్‌ బ్యాంక్‌గా మాత్రమే ఆయన అభివర్ణించడం గమనార్హం. పాల్, క్లారాల పెంపకంలో లభించిన స్వేచ్ఛ, ఉత్సుకతలే ఆ తర్వాత కాలంలో యాపిల్, పిక్సర్ వంటి విప్లవాత్మక సంస్థల స్థాపనకు పునాది వేసాయి.

జెఫ్ బెజోస్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అసలు పేరు ‘జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్సెన్’. ఆయన జన్మించిన 17 నెలలకే తల్లి జాక్లిన్ తండ్రి నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరి తల్లిగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. జెఫ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పుడు క్యూబా వలసదారుడైన మిగ్యుల్ మైక్ బెజోస్‌ను జాక్లిన్ వివాహం చేసుకున్నారు.

మైక్ బెజోస్ జెఫ్‌ను చట్టబద్ధంగా దత్తత తీసుకుని తన ఇంటిపేరును ఇచ్చారు. మైక్ అందించిన స్థిరమైన కుటుంబ వాతావరణం, క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత జెఫ్ బెజోస్ జీవితాన్ని మలుపు తిప్పాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో జెఫ్ ప్రయోగాలకు మైక్ పూర్తి మద్దతునందించారు. దత్తత ద్వారా లభించిన ఈ అవకాశం తనలో వ్యూహాత్మక ఆలోచనలను, అపజయాలను తట్టుకునే శక్తిని పెంచిందని బెజోస్ పలుమార్లు గుర్తుచేసుకున్నారు.

లారీ ఎల్లిసన్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ బాల్యం మరింత సంఘర్షణలతో కూడుకున్నది. న్యూయార్క్ నగరంలో 19 ఏళ్ల ఒంటరి తల్లికి జన్మించిన లారీ, చిన్నప్పుడే తీవ్రమైన న్యూమోనియా బారిన పడ్డారు. అనారోగ్యం, పేదరికం కారణంగా ఆమె లారీని దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చికాగోలో నివసించే ఆమె అత్తామామలు లిలియన్, లూయిస్ ఎల్లిసన్ లారీని చేరదీశారు.

తల్లిగా మారిన అత్త లిలియన్ లారీకి ఎనలేని ప్రేమను పంచగా మామ లూయిస్ కఠినంగా, దూరంగా ఉండేవారు. చికాగో సౌత్ సైడ్‌లోని నిరాడంబర వాతావరణం, ఈ సంక్లిష్ట కుటుంబ పరిస్థితులు లారీలో తీవ్రమైన ఆశయాన్ని పెంచాయి. తన 12వ ఏట దత్తత వాస్తవాన్ని గ్రహించిన లారీ 48 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తనను కన్న తల్లిని కలవలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణమే ఆయనను ఒక పట్టుదల కలిగిన విజేతగా మార్చింది.

డేవ్ థామస్

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ ‘వెండీస్’ వ్యవస్థాపకుడు డేవ్ థామస్ జీవితం కూడా దత్తతతో ముడిపడి ఉన్నదే. రెక్స్ డేవిడ్ థామస్‌గా జన్మించిన ఆయనను న్యూజెర్సీకి చెందిన రెక్స్, ఔలేవా థామస్ దంపతులు శిశువుగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు. అయితే, ఐదేళ్ల వయసులోనే దత్తత తల్లిని కోల్పోవడం, ఆ తర్వాత వరుస కుటుంబ నష్టాలు ఆయనను కుదిపేశాయి. దత్తత ప్రాధాన్యతను గుర్తించిన ఆయన అనాథ పిల్లలకు శాశ్వత గృహాలను కల్పించేందుకు ‘డేవ్ థామస్ ఫౌండేషన్ ఫర్ అడాప్షన్’ను స్థాపించి సమాజానికి సేవ చేస్తున్నారు.

ఈ నలుగురు బిలియనీర్ల కథలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పుట్టుక లేదా తొలినాళ్లలో అస్థిరతలు మనిషి భవిష్యత్తును నిర్ణయించలేవు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అందించిన ప్రేమ, మార్గదర్శకత్వం, స్థిరత్వమే ఈ ముగ్గురిని గ్లోబల్ టెక్ దిగ్గజాలను, ఒక వ్యాపార సామ్రాజ్యాధినేతను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకున్న వీరి జీవితాలు నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకం.

ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement