దీపావళికి బంగారం కొందాం!

28 percent people are planning to Gold purchase this Diwali  - Sakshi

పట్టణ ప్రజల్లో 28 శాతం మంది ప్రణాళిక

కరోనా మహమ్మారి

ప్రభావం తగ్గుతున్న నేపథ్యం

‘యూగవ్‌’ వ్యయ సూచీ వెల్లడి  

ముంబై: దీపావళి సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 28 శాతం మంది ప్రజలు పసిడి కొనుగోళ్ల ప్రణాళికతో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రత్నాలు ఆభరణాల పరిశ్రమకు తాజాగా మార్కెట్‌ పరిశోధన సంస్థ ‘యూగవ్‌’  దీపావళి వ్యయ సర్వే సూచి ఊరటనిస్తోంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన సర్వే వివరాల్లో కొన్నిముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► 2020లో తీవ్ర సంక్షోభానికి గురయిన పరిశ్రమ 2021 జనవరి– మార్చి మధ్య కోలుకుంది. అయితే ఈ రికవరీపై సెకండ్‌వేవ్‌ దెబ్బపడింది.  

► ప్రసుత పరిస్థితులపై పరిశ్రమలో ఆశాజనక వాతావరణం నెలకొంది. వినియోగ డిమాండ్‌ వేగంగా పుంజుకుంటుందని, పండుగల సీజన్‌లో సెంటిమెంట్‌ మెరుగుపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

► ప్రతి 10 మంది పట్టణ భారతీయుల్లో ముగ్గురు వచ్చే 3 నెలల్లో పసిడి కొంటామన్నారు.  

► దేశ వ్యాప్తంగా ఆగస్టు 17–20 మధ్య 2,021 మందిని ఆన్‌లైన్‌ ద్వారా చేసిన ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.  

► ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు తెలిపిన ప్రతి ఐదుగురులో ముగ్గురు (58 శాతం మంది) వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు భౌలికంగా అలాగే సంఘటిత రిటైలర్ల గోల్డ్‌ స్కీమ్‌ల ద్వారా పసిడిని కొంటామని తెలిపారు. 38 శాతం మంది పెట్టుబడిగా పసిడి కొంటామని (గోల్డ్‌ ఫండ్స్‌ ద్వారా లేదా భౌతికంగా) వెల్లడించారు.  

► పసిడి కొనుగోలు ఖాయమని పేర్కొన్న వారిలో 69% మంది ఇందుకు దీపావళి లేదా పండుగల సీజన్‌ సరైన సమయమని పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top