●బేతంపూడిలో విషాదం
జూలూరుపాడు(సుజాతనగర్): సుజాతనగర్ మండలం స్టేషన్ బేతంపూడిలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్ బేతంపూడి గ్రామానికి చెందిన బానోత్ హరి అలియాస్ బాబూరావు, స్రవంతి దంపతుల రెండు సంతానం బానోత్ జశ్వంత్(3). శనివారం తాతా చంది జశ్వంత్‌కు అన్నం తినిపిస్తున్నాడు. ఈ క్రమంలో అన్నం తినుకుంటూ బాలుడు ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో కొత్తగూడెం (హౌసింగ్ బోర్డు కాలనీ) వద్దనున్న శ్రీచైతన్య ప్రైవేటు పాఠశాల బస్సు గ్రామంలో విద్యార్థులను దింపేందుకు వచ్చింది. ఈ క్రమంలో బస్సు ఢీకొనడంతో చిన్నారి వెనక టైరు కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును వదిలేసి అక్కడి నుంచి పారిపోగా, బస్సును స్థానికులు అడ్డుకున్నారు. బాలుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చిన్నారి మృతితో స్టేషన్ బేతంపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


