●కూరగాయల వ్యాపారి దుర్మరణం
మణుగూరు టౌన్/ అశ్వాపురం: కూరగాయల వ్యాపారం ముగించుకుని వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెంది భాగం విష్ణుకాంత్(35) సంతల రోజు కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం కరకగూడెంలో సంత ముగించుకుని రాత్రి వేళ తిరిగి వస్తున్నాడు. మణుగూరు శివారు గ్రామమైన రామానుజవరం దాటాక ఇసుక లోడు కోసం రామానుజవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. విష్ణుకాంత్ టాటా ఏస్‌లో ఇరుక్కుపోగా, స్థానికులు సుమారు అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు. అంతర్గత భాగాలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో టాటాఏస్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుడికి భార్య సౌమ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేకలను కాపాడబోయి కాపరి మృతి
అన్నపురెడ్డిపల్లి: మేకలను పట్టాలు దాటించే క్రమంలో రైలు ఢీకొని మహిళా మేకల కాపరి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని బూర్గుగుడెం గ్రామానికి చేందిన బాల్ధా కృష్ణవేణి(32) శనివారం ఉదయం గ్రామ సమీపంలోని తోట ల్లోకి మేకలు మేపేందుకు తోలుకెళ్లింది. అదే సమయంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వైపు బొగ్గు రైలు వస్తుండటాన్ని గమనించిన కృష్ణవేణి మేకలను పట్టాలు దాటించింది. తాను పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పందిరి వేస్తుండగా కిందపడి వ్యక్తి..
భద్రాచలంఅర్బన్: చికిత్సపొందుతున్న వ్యక్తి శనివారం మృతి చెందాడు. ఎఫ్ఐ ఆర్‌లో నమోదైన వివరాల ప్రకారం.. భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన కిరాలి శ్రీను (49) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25న వెంకటేశ్వర కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పందిరి వేసేందుకు వెళ్లాడు. పందిరి వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాము శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ రాజు కేసు నమోదు చేశారు.
వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం
సూపర్‌బజార్(కొత్తగూడెం): వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ అఖిల కథనం ప్రకారం.. మండలంలోని చాతకొండలో కేసుపల్లి పవన్ యువకుడు, అతని తల్లి జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 25న రాత్రి పవన్ ఊర్లో లేని సమయంలో అతని స్నేహితుడు గోడదూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తోడుగా పడుకోవాలని పవన్ చెప్పినట్లు 58 ఏళ్ల వృద్ధురాలిని నమ్మించాడు. అనారోగ్యంతో ఉన్న ఆమైపె లైంగిక దాడికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
యువతి ఆత్మహత్య
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ప్రియాంక(23) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహం కావడం లేదని మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి కామేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
17 పశువులు స్వాధీనం
భద్రాచలంఅర్బన్: చర్ల నుంచి కోదాడకు అక్రమంగా తరలిస్తున్న 17 పశువులను శనివా రం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని బ్రిడ్జిపాయింట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఐచర్ లారీలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్‌తో పాటు సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.


