రెండేళ్ల క్రితం భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్ మంజూరు
ఈ మార్గంలో భద్రాచలం వద్ద గోదావరిపై వంతెన తప్పనిసరి
పోలవరం బ్యాక్ వాటర్‌తో బ్రిడ్జి నిర్మాణానికి పెరగనున్న ఆర్థికభారం
రైల్వేపై దృష్టి పెట్టాలి
రైల్వేకూ బ్యాక్ వాటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను గుర్తించి, తగిన చర్యలు తీసుకోకపోతే భద్రాచలం సబ్ డివిజన్ అభివృద్ధి సైతం ప్రమాదంలో పడనుంది. ఇప్పటికే మంజూ రైన భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వేలైన్‌లో భాగంగా గోదావరిపై చేపట్టాల్సిన రైల్వే వంతెన నిర్మాణం కూడా భారంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనతో భద్రాచలం సబ్ డివిజన్‌లో ఏడు మండలాలు ఏపీలో కలిసిపోయాయి. కేవలం భద్రాచలం పంచాయతీ మినహా టెంపుల్ టౌన్ చుట్టూ అసలు స్థలమే లభ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పుష్కర కాలంగా భద్రాచలం అభివృద్ధికి దూరమైంది. ఈ క్రమంలో కేంద్రం భద్రాచలం మీదుగా కొత్త రైల్వే మార్గాలను ప్రకటించడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమైంది. స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ కోటాలో 2024లో మల్కాన్‌గిరి–పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. తెలంగాణ, ఏపీ, ఒడిశాల గుండా లైన్ నిర్మించాల్సి ఉండగా, రెండున్నరేళ్లుగా భూసేకరణ ప్రక్రియ సాగుతోంది. అది పూర్తయితే నిర్మాణ పనులు ప్రారంభించి, ఐదేళ్లలో లైను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
త్వరగా పాండురంగాపురం నుంచి
సారపాక వరకు నిర్మిస్తే...
174 కి.మీలు నిర్మించా ల్సి న పాండురంగాపురం–మల్కాన్‌గిరి రైలు మార్గానికి రూ.3,592 కోట్ల ఖర్చవుతుందని కేంద్రం పేర్కొంది. పాండురంగాపురం నుంచి సారపాక వరకు 13 కి.మీ మేరకు త్వరగా కొత్త లైన్ నిర్మిస్తే, తక్కువ బడ్జెట్‌తోనే భద్రాచలానికి రైలు మార్గం అందుబాటులోకి తేవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే కోరుతోంది. ఆ తర్వాత దశలో గోదావరిపై వంతెన నిర్మాణం, ఏపీలో పలు స్టేషన్ల మీదుగా ఒడిశాలోని మల్కాన్‌గిరి కి వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ప్రాధాన్యతలు కూడా అలాగే ఉన్నాయి.
ఎక్కువ సమయం, నిధులు
ప్రస్తుతం గోదావరిలో జూలై నుంచి సెప్టెంబరు/అక్టోబరు వరకే వరద నీరు ఎక్కువగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత అక్టోబరు నుంచి జూన్ వరకు తక్కువ స్థాయిలో నీరు ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో ఆరు నెలలు 48 అడుగుల మేర, మరో ఆరునెలలపాటు కనీసం 20 అడుగులకు పైన నీరు ఉంటుంది. ఆ స్థాయిలో నీరు నిలిచి ఉంటే గోదావరిపై రైల్వే వంతెన నిర్మాణానికి ఎక్కు వ సమయం, ఎక్కువ బడ్జెట్ అవసరమవుతుంది. అదే పరిస్థి తి ఎదురైతే భద్రాచలం మీదుగా ముందుగా మల్కాన్‌గిరి తర్వాత కిరండోల్ ప్రాంతాలకు రైలు మార్గాలు సకాలంలో అందుబాటులోకి రావడమనేది కష్టంగా మారుతుంది. వెరసి భద్రాచలం అభివృద్ధికి మరోసారి చుక్కెదురు అయ్యే ప్రమాదం ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం సబ్ డివిజన్‌లో ఏ మేరకు పంట పొలాలు ముంపునకు గురవుతాయి, భద్రాచలం పట్టణం ఏ మేరకు ప్రభావితం అవుతుందనే అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఇటు తెలంగాణ సర్కార్ సైతం ఇదే అంశంపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. భద్రాచలం భవిష్యత్‌కు ఆశాకిరణాల్లా మారిన కొత్త రైలు మార్గాల నిర్మాణ పనులపై బ్యాక్ వాటర్ ప్రభావం అంశానికి కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు మొదలు పార్లమెంటు సభ్యుల వరకు పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌ను దృష్టిలో ఉంచుకుని పాండురంగాపురం నుంచి సారపాకకే పరిమితం కాకుండా భద్రాచలం వరకు త్వరిత గతిన రైలు మార్గం అందుబాటులోకి తేవాలని కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.


