బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు నూరుశాతం పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి డి.వాసంతి ఆదేశించారు. సోమవారం బూర్గంపాడు కేజీబీవీని సందర్శించారు. విద్యాబోధన, హాజరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నలుగురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలో కొత్త ప్రవేశాలను పరిశీలించి ఎన్‌రోల్‌మెంట్ మరింత పెంచాలని సూచించారు. అనంతరం వంటగది, ఆహార నిల్వలు, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థినులతో ముచ్చటించి అభ్యాస సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎన్.సతీష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంలు, ఆర్పీలకు షోకాజ్ నోటీస్
కొత్తగూఅర్బన్: జిల్లాలోని పలు పాఠశాలలను డీఈఓ వాసంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న మిడిసిలేరు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రాళ్లపురం, కిష్టారంపాడు పాఠశాలలు మూతబడి ఉండటం, కుదునూరు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సరైన సమాచారం లేకుండా హాజరు కాకపోవడం, సమయానికంటే ముందే పాఠశాలను విడిచివెళ్లడంతో ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, రిసోర్స్‌పర్సన్లకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు డీఈఓ తెలిపారు.


